ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..

1 గంట క్రితం

cycle raly.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 10:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • కాకినాడ రవాణా శాఖ ఆధ్వర్యంలో సైకిల్‌ ర్యాలీ

ప్రజాశక్తి–కాకినాడ : రహదారి భద్రత, బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కాకినాడ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం భారీ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ (డీటీసీ) కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ ఉత్సాహభరిత వాతావరణంలో పిఠాపురం వరకు సాగింది.

ఈ కార్యక్రమానికి డీటీసీ ఇన్‌చార్జి ఆర్‌.సురేష్‌, ఆర్టీవో ఇన్‌చార్జి బి.వి.మురళీకృష్ణ, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు సంయుక్తంగా నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలకు గురై విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడం కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాదని, ప్రతి ఒక్కరూ తమ ప్రాణాల రక్షణ బాధ్యతను స్వచ్ఛందంగా గుర్తించాలని పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనాలపై పరిమితికి మించి ముగ్గురు ప్రయాణించడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల ప్రాణాంతక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కు దూరంగా ఉండాలని, రహదారి నిబంధనల ప్రకారం నిర్దేశిత వేగ పరిమితిలోనే వాహనాలు నడపాలని సూచించారు. వాహనం నడుపుతున్న సమయంలో సెల్‌ఫోన్‌ ఉపయోగించడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు. అత్యవసరంగా ఫోన్‌ మాట్లాడాల్సి వస్తే వాహనాన్ని రహదారి పక్కన సురక్షితంగా నిలిపి మాట్లాడాలని సూచించారు. ప్రభుత్వం, అధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ప్రజల్లో స్వీయ మార్పు వచ్చినప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు. జిల్లా ప్రజలందరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించి రవాణా శాఖకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది, స్థానిక సైక్లిస్టులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్