‘వార్డుకు పోదాం’ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు
ప్రజాశక్తి–విజయనగరం టౌన్ : విజయనగరంలో పూరిగుడిసెలు, రేకుల ఇళ్లలో నివాసం ఉంటున్న పేదలకు వారు నివసిస్తున్న చోటే పట్టాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు. ఆదివారం 29వ డివిజన్‌లోని రామకృష్ణనగర్‌లో నిర్వహించిన ‘వార్డుకు పోదాం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సిపిఎం పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం జిఒ నంబర్ 30ను తీసుకొచ్చిందని, అయితే దాన్ని పేదలకు పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని విమర్శించారు. రామకృష్ణనగర్, ఎల్‌బీజీ నగర్, గురజాడనగర్, వినాయకనగర్ తదితర కాలనీల్లో నివాసం ఉంటున్న పేదలు తమ ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని ఇప్పటికే వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తులు చేసుకుని ఆరు నెలలు గడిచినా ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదన్నారు. తక్షణమే పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన పెద్దలు జిఒ నంబర్ 30ను అడ్డుపెట్టుకుని అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. పేదలు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న కాలనీల్లో మాత్రం సెంటు భూమికి పట్టా ఇవ్వడానికి ప్రభుత్వం ఎందుకు శ్రద్ధ చూపడం లేదని ప్రశ్నించారు. పేదల కోసం తీసుకొచ్చిన జిఒ పెద్దలకు ప్రయోజనం చేకూర్చేలా మారిందని విమర్శించారు. పేదలకు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం పత్రికా ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదన్నారు. విశాఖపట్నంలో శనివారం ముఖ్యమంత్రి, మంగళగిరిలో లోకేశ్ పట్టాలు పంపిణీ చేశారని, విజయనగరంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జిఒ నంబర్ 30 రాష్ట్రవ్యాప్తంగా వర్తిస్తుందని తెలిపారు.
విజయనగరంలోని ఎల్‌బీజీ నగర్, రామకృష్ణనగర్, గురజాడనగర్, వినాయకనగర్ తదితర కాలనీల్లో ప్రజలు ఏళ్ల తరబడి నివాసం ఉంటున్నారని, వారికి తక్షణమే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టాల సాధన కోసం చేపడుతున్న కార్యక్రమాలకు పేదలంతా కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం విజయనగరం నగర కమిటీ సభ్యులు ఎం.శాంతమూర్తి, జగదాంబ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)