శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Fee: పిజి విద్యార్థులకు అందని ఫీజు రీయంబర్స్‌‌మెంట్‌

14 నవంబర్, 2026

పిజి విద్యార్థులకు అందని ఫీజు రీయంబర్స్‌‌మెంట్‌ 
- అమలుకు నోచుకోని ‘కూటమి’ హామీ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 10:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- అమలుకు నోచుకోని ‘కూటమి’ హామీ

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఉన్నత విద్యను అభ్యసించాలనే పేద, మధ్యతరగతి విద్యార్థుల ఆశలకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకం నిలిపివేత అడ్డంకిగా మారుతోంది. రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో పిజి కోర్సులు చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకాన్ని వర్తింపజేయకుండా 2020 డిసెంబర్‌ 25న జిఓ 77ను గత ప్రభుత్వం విడుదల చేసింది. ప్రైవేటు పిజి కళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో చేరిన విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను వర్తింపచేయొద్దని ఈ జిఓ సారాంశం. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే కళాశాలల్లో చదివే విద్యార్థులకు మాత్రమే ఈ పథకాలను పరిమితం చేసింది. దీంతో ప్రైవేటు కళాశాలల్లో పిజి కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌ అందలేదు. 77 జిఓను రద్దు చేసి ప్రైవేట్‌ కళాశాలల్లోని విద్యార్థులకూ వర్తింపజేయాలని అప్పట్లో విద్యార్థి సంఘాలు పెద్దయెత్తున ఆందోళనలు చేశాయి.

అధికారంలోకి వస్తే ‘ఎయిడెడ్‌ ‌కళాశాలలు, ప్రైవేట్‌ పిజి విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌‌మెంట్‌‌ పునరుద్ధరిస్తాం’ అని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో-2024లో పొందుపరిచింది. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‌పిజి ఫీజు రీయంబర్స్‌‌మెంట్‌ ‌నిలిపివేయడంపై 2023 నవంబరు 16‌న అప్పటి సిఎం వైఎస్‌ ‌జగన్‌‌కు లేఖ కూడా రాశారు. టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీ అమలు కాలేదు. ప్రభుత్వ ఆర్థిక సహకారం లేకపోవడంతో విద్యార్థులపై ట్యూషన్‌ ఫీజుల భారం పడుతోంది. 2025 నవంబరు 21న విద్యార్థి సంఘాలతో మంత్రి లోకేష్‌ సమావేశం ఏర్పాటు ‌చేసి 2026 - 27 విద్యా సంవత్సరం నుంచి పిజి విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌‌మెంట్‌ ‌పథకం అమలు చేస్తామని ఇచ్చిన హామీ కూడా ఇప్పటికీ అమలు చేయలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్