- ఆందోళనలో దరఖాస్తుదారులు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టిఆర్ భరోసా పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తి చేసినా పింఛన్ల పంపిణీ విషయంలో సందిగ్ధత నెలకొంది. దరఖాస్తులు కోసం జారీ చేసిన సర్క్యలర్లో పరిశీలన ప్రక్రియ సెప్టెంబరు 24తో పూర్తి చేసిన మండల, పట్టణ స్థాయి అధికారులు నివేదికలు సమర్పిస్తే 25 నుంచి 26వ తేదీ వరకూ బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ చేపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ సజావుగా పూర్తయినా అక్టోబరు నెలలో కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని, పాత లబ్ధిదారులకు మాత్రమే పింఛన్లు చెల్లిస్తామని అధికారులు చెప్పడంతో కొత్తగా దరఖాస్తులు చేసుకున్నవారు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తుల స్వీకరణను ప్రభుత్వం సెప్టెంబరు 7 నుంచి 16వ తేదీ వరకూ అవకాశం ఇవ్వగా, వివిధ ప్రజా సంఘాల నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు మరో రెండు రోజులు పొడిగించింది. 21వ తేదీ వరకూ సాధారణ అర్హతల పరిశీలన, 24 వరకూ భౌతిక, శాఖాపరమైన ధృవీకరణ, అర్హతల నిర్ణయం, రాష్ట్ర స్థాయికి సిఫార్సు చేయాల్సి ఉంది. మొత్తం 10 రకాల పింఛన్లకు రాష్ట్ర వ్యాప్తంగా 13.65 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అత్యధికంగా వృద్ధాప్య 6.88 లక్షలు, తరువాతి స్థానంలో వితంతు 2.97 లక్షలు, వికలాంగ పింఛన్లకు 1.81 లక్షలు, చేనేత 21,565 దరఖాస్తులొచ్చాయి. చర్మకారులు 67,853, డప్పు కళాకారులు 50,972, మత్స్యకార 31,825, గీత కార్మికుల పింఛన్లకు 16,430, ఒంటరి మహిళ 9,201, హిజ్రాల కేటగిరి పింఛన్లకు 800 దరఖాస్తులు రాగా, వీటిని ఆయా మండలాల ఎంపిడిఒలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ స్థాయిలో సిక్స్ స్టెప్ వ్యాల్యుయేషన్ పూర్తి చేసి అనుకున్న షెడ్యూల్ ప్రకారం 26వ తేదీకి రాష్ట్ర స్థాయికి నివేదికలు సమర్పించారు. అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ అనంతరం వివిధ కేటగిరిల పింఛన్లకు సంబంధించి 1.42 లక్షల మందిని అనర్హులుగా గుర్తించారు. రాష్ట్ర స్థాయిలో ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ నిధులు విడుదల చేయడంలో బ్రేక్ పడింది. దీంతో అక్టోబరు నెలలో తమకు పింఛను లభిస్తుందని ఆశ పెట్టుకున్న దరఖాస్తుదారులకు నిరాశే ఎదురైంది. పాత లబ్ధిదారులైన 61.80 లక్షల మందికి సంబంధించి రూ.2,692.34 కోట్లను ప్రభుత్వం సెప్టెంబరు 24నే విడుదల చేసింది.








కామెంట్లు (0)