హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై టైరు మారుస్తున్న వారిని లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మేడ్చల్ పరిధిలో కారు, లారీ ఢీకొన్న మరో ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ - వరంగల్ జాతీయ రహదారిపై జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలం నెల్లుట్ల సమీపంలో తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లింగాలఘనపూర్ ఎస్సై బండి శ్రవణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. దేవరుప్పుల మండలంలో కిరాణా దుకాణం నిర్వహించే జాట్ రోహిత్, యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండ కొత్తపల్లికి చెందిన మధు.. టాటా ఏస్ మినీ ట్రక్కులో హైదరాబాద్ నుంచి కిరాణా సామగ్రిని తీసుకొస్తున్నారు. నెల్లుట్ల సమీపంలోకి రాగానే ట్రక్కు టైరు పంక్చర్ అయింది. సహాయం కోసం అదే దారిలో వెళ్తున్న ఒక లారీని ఆపి, వారి వద్ద నుంచి జాకీ తీసుకున్నారు. లారీ క్లీనర్ రాజేందర్, ట్రక్కు డ్రైవర్ మధు, కిరాణా యజమాని రోహిత్ కలిసి పంక్చర్ అయిన టైరును మారుస్తుండగా.. వెనుక నుంచి అత్యంత వేగంగా వచ్చిన మరో లారీ వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు జనగామ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
కారును ఢీకొన్న లారీ: ఒకే కుటుంబంలో ముగ్గురు బలి
మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ పరిధిలోని తుర్కపల్లి-మురహరిపల్లి మధ్య మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అదే వేగంతో ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.









కామెంట్‌లు (0)