ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో: ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య గురయ్యారు. కారులో వచ్చిన దుండగుడు కొబ్బరి బొండాలు నరికే కత్తితో పట్టపగలు నరికి చంపాడు. నిజామాబాద్ నగరం నడిబొడ్డున పట్టపగలు జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతుడు హరిబాబు తన భార్య వైష్ణవి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన హరిబాబు (25), కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి (21) ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయిన పది నెలల నుంచి అదనపు కట్నం కోసం హరిబాబు ఆమెను వేధించారు. మూడు నెలల గర్భిణిగా ఉన్న వైష్ణవిని ఈ ఏడాది మార్చిలో హత్య హత్య చేశారు. ఈ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలై నిజామాబాద్ నగరానికి కుటుంబంతో కలిసి వలసవచ్చారు. ఆర్‌ఆర్ చౌరస్తా సమీపంలోని ఉషా ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్ ఎదురుగా తన తల్లితో కలిసి పచ్చి మక్క బుట్టలు విక్రయిస్తున్నారు. గురువారం సాయంత్రం ఎప్పటిలాగే మక్కబుట్టలు అమ్ముతూ నీళ్ల కోసం బాటిల్ పట్టుకొని పక్కనే ఉన్న పానీపూరి బండి వద్దకు వచ్చి నీళ్లు నింపుతుండగా, అదే సమయంలో కారులో నుంచి వచ్చిన ఓ దుండగుడు కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేసి కారు ఎక్కి పరారయ్యారు. పది సెకన్ల వ్యవధిలో తొమ్మిదిసార్లు నరకడంతో హరిబాబు రక్తపుమడుగులో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందిన సిసి ఫుటేజీ వీడియో వైరల్‌గా మారింది. అక్కడే ఉన్న మృతుని తల్లి ఒక్కసారిగా బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రాజ్, ఎసిపి ప్రకాష్ యాదవ్, 2వ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ యాదగిరి గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జిజిహెచ్‌లోని మార్చూరీకి తరలించారు.
ప్రతీకార హత్య?
యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరిబాబును ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసేందుకు ఎన్ని రోజులుగా రెక్కీ నిర్వహించారు. హత్య చేసిన అనంతరం కారు ఏ వైపునకు వెళ్లిందో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను గుర్తించేందుకు సిపి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. సిసి ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కారు నెంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు.
నా చెల్లి పరిస్థితి మరొకరికి రావొద్దనే హత్య : వైష్ణవి సొదరుడు
‘నా చెల్లి పరిస్థితి మరొకరికి రావొద్దనే హత్య చేశాను’ అని వైష్ణవి సోదరుడి సెల్ఫీ వీడియో పెట్టి పోలీసులకు లొంగిపోతున్నట్టు వీడియో లో ప్రకటన చేశారు. వీడియోలో అతను చెప్పిన దాని ప్రకారం.. ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆశించి ఎదురు చూశానని, కానీ జరగలేదని తెలిపారు. నిజామాబాద్‌కి వచ్చినప్పుడు హరిబాబు కనిపించడంతో తన వద్ద ఉన్న కత్తులతో హత్య చేసినట్టు ప్రకటించారు. తనకు సపోర్ట్ చెయ్యాలని, శిక్ష పడకుండా చూడాలని మద్దతు ఇవ్వాలని, తనకు భార్యా, పిల్లలు ఉన్నారని కంటతడి పెడుతూ సెల్ఫీ వీడియో తీశాడు.








కామెంట్‌లు (0)