3 దశల్లో ఉద్యమ కార్యాచరణ
ఎపి జెఎసి అమరావతి ప్రకటన
కార్మిక సంఘాల మద్దతు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ ఎపిజెఎసి అమరావతి రాష్ట్ర కమిటీ దశలవారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. విజయవాడలో ఎంబిబికెలో శుక్రవారం నిర్వహించిన ఎపిజెఎసి సదస్సులో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ, వినతిపత్రాలు అందజేయడంతో పాటు చర్చలు, సమావేశాలు నిర్వహించినప్పటికీ నిర్ణయాలు తీసుకోవడం లో తీవ్రమైన జాప్యం చేస్తున్నందున ఉద్యమ బాట పట్టక తప్పడం లేదని పేర్కొన్నారు.
ఎపిజెఎసి అమరావతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, ఉద్యమ కమిటి చైర్మన్ టి.వి.ఫణి పేర్రాజు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం నుండీ నేటి వరకు 40 వేల కోట్లు పైబడి పిఆర్శీ, డిఏ, సరండర్ లీవులు తధితర ప్రయోజనాలను, ఎన్నికల ముందు కూటమి మేనిఫెస్టో లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నదే ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమన్నారు.
మొదటి దశ ఇలా...
మొదటి దశ ఉద్యమ కార్యాచరణ ఈ నెల 31 నుంచి ప్రారంభమై వచ్చే నెల 11వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ నెల 31న ఉద్యోగుల సమస్యలపై జిల్లా కలెక్టర్లకు నోటీసులు అందిస్తారు. సెప్టెంబర్ ఒకటిన ‘సిఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి’..అనే నినాదాన్ని ప్రతి ఉద్యోగి డిపిగా పెట్టుకుంటారు. నల్ల బ్యాడ్జీలుధరించి విధులకు హాజరవుతారు. 2 నుండి 8వ తేదీ వరకూ హ్యాండ్ టూ హ్యాండ్ కార్యక్రమం, 3 నుండి 5 వరకు భోజన విరామ సమయంలో నిరసనలు, 11 న అన్ని జిల్లా కేంధ్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
రెండో దశ లో..
రెండవ దశ ఉద్యమ కార్యాచరణలో సెప్టెంబర్ 15 వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ వర్క్ టూ రూల్ పాటిస్తారు.
15 వ తేది నుండే ఉద్యమానికి మద్దతుగా తమ వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్ డిపిలు, ఫోటోలు, రీల్స్ ప్రచారం చేస్తారు.
25వ తేదీ వరకూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తారు.
17 న జిల్లాలు, డివిజన్ స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ‘సిఎం సార్.. మా డబ్బులు మాకివ్వండి’..అనే నినాదం తో మానవహారం చేపడతారు. , 23 న కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహిస్తారు.
26 న కలెక్టరేట్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద కుటుంబ సభ్యులతో ధర్నాలు నిర్వహిస్తారు.
మూడవ దశ ఉద్యమంలో..
మూడవ దశ కార్యాచరణలో రెండు మల్టీజోన్ స్దాయిలో మల్టీ జోన్ సదస్సులు, సహాయనిరాకరణ, రిలే నిరాహారధీక్షలు, ఛలో విజయవాడ, నిరవధికసమ్మె లాంటి ఉధృతమైన కార్యచరణను, రెండవ దశ ఉద్యమ కార్యాచరణ నాటికి కలసి వచ్చే సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలని నిర్ణయించినట్లు జెఎసి తెలిపింది.
ఉద్యోగుల ఉద్యమానికి అండగా ఉంటాం
సదస్సుకు ముఖ్యఅతిధులుగా హాజరైన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగులు గొంతమ్మ కోర్కేలు కోరడంలేదని , ఉద్యోగులందరికీ ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలనని కోరారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్.రవీంధ్రనాధ్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.వెంకటసుబ్బయ్యలు మాట్లాడుతూ.. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన సూమారు 45 వేల కోట్లు రూపాయలు చెల్లించాలని న్యాయమైన డిమాండ్లు కోసం పోరాటాలకు పూర్తీ మద్దతు ఇస్తూ, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొంటామని హామీ ఇచ్చారు.








కామెంట్‌లు (0)