ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిశాఖలో బాలిక కిడ్నాప్ కలకలం

1 రోజు క్రితం

kidnap.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 09:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తొమ్మిది గంటల్లోనే తల్లిదండ్రులకు చెంతకు చేర్చిన పోలీసులు

ప్రజాశక్తి - విశాఖ కలెక్టరేట్‌ : విశాఖపట్నంలో బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. రైల్వేస్టేషన్ బస్టాప్ వద్ద ఫుట్‌పాత్‌‌పై తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న నాలుగేళ్ల బాలికను ఇద్దరు దుండగులు అపహరించుకుపోయారు. పోలీసులు కేసును ఛేదించి బాలికను సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసు వివరాలను ఈస్ట్ సబ్ డివిజన్ ఎసిపి కె లక్ష్మణమూర్తి మీడియాకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన సయ్యద్, శివ పార్వతి దంపతులు తమ కుమార్తెతో కలిసి ఈ నెల 23న విజయవాడ నుంచి విశాఖకు వచ్చారు. చైల్డ్ హోమ్ కేర్‌‌లో ఉన్న వారి బంధువుల అబ్బాయిని చూసేందుకు వెళ్లారు. రాత్రి సేదతీరడానికి అక్కడ అనువైన ప్రదేశం లేకపోవడంతో రైల్వేస్టేషన్ బస్టాప్ వద్ద నిద్రించారు. అర్ధరాత్రి 1.40 గంటలకు లేచి చూసేసరికి కుమార్తె కనిపించకపోవడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. టూటౌన్ గస్తీ అధికారులు శ్రీను, రమేష్, ఇతర సిబ్బంది రైల్వేస్టేషన్ వద్దకు చేరుకొని బాలిక వివరాలను సేకరించి కేసు నమోదు చేశారు. అనంతరం సిసి కెమెరాలను పరిశీలించిన పోలీసులు ఓ యువతీ, యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చి బాలికను అపహరించుకుపోయినట్టు గుర్తించారు. బాలిక అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం వద్ద ఉన్నట్టు గుర్తించి అక్కడకు వెళ్లి విశాఖకు తీసుకొని వచ్చారు. కేసు దర్యాప్తు చేపడుతున్నామని, నిందితుల వివరాలు తరువాత తెలియజేస్తామని, వారిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేపడుతున్నామని వెల్లడించారు. ఘటన జరిగిన తొమ్మిది గంటల్లోనే బాలికను గుర్తించి ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్టు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్