అమరావతి : ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా తన కుమార్తె అంజిలి వివాహ వేదిక మార్పునకు సంబంధించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కీలక ప్రకటన చేశారు. యలహంకలోని ప్రాపర్టీ అంశంపై, కుమార్తె పెళ్లి వేదిక మార్పు వెనుక ఉన్న కారణాలను వివరిస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ఇంకొకరి దానికోసం ఆశపడే నీచత్వం తనది కాదని షర్మిల అన్నారు.
‘ప్యాలెస్‌పై పూర్తి హక్కులు నావే’ ....
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అప్పటి వరకు ఉమ్మడి ఆస్తిగా ఉన్న యలహంక ప్రాపర్టీ.. ఆస్తుల పంపకాల్లో భాగంగా పూర్తిగా 100 శాతం హక్కులు తనకు, తన పిల్లలకు సంక్రమించాయని షర్మిల స్పష్టం చేశారు. ఇది దేవుడి సాక్షిగా నిజమని పేర్కొన్నా. ‘అది నా పిల్లల చట్టబద్ధమైన హక్కు మాత్రమే కాకుండా స్వర్గీయ నాన్న వైఎస్సార్ గారు తిరిగిన ఇల్లు’ అని స్పష్టం చేశారు.
తెలుగువారి సంప్రదాయంలో సొంత ఇంట్లో బిడ్డ పెళ్లి చేయడం ఏ తల్లిదండ్రులకైనా ఒక పెద్ద అదృష్టమని షర్మిల పేర్కొన్నారు. ‘తాను పెరిగిన యలహంక ఇంట్లోనే తన వివాహం జరగాలని నా కుమార్తె అంజిలి కోరుకుంది. అయితే అక్కడ వివాహం జరిపించలేకపోతున్నామని, బిడ్డ ఆశను నెరవేర్చలేకపోయామనే బాధ నన్ను ఎంతగానో తొలిచేస్తోంది. వివాహ వేదిక విషయమై జరుగుతున్న పరిణామాలను చూసి నా బిడ్డ కోసం బాధపడిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
వివాదాలకు దూరంగా వేరే చోట వివాహం ....
తన కూతురిది పెద్దలు కుదిర్చిన సంబంధమని, ఎలాంటి వివాదాలు, గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా తమపై ఉందని షర్మిల తెలిపారు. అందుకే వైఎస్ అంజిలి రెడ్డి – సోమల రఘురామ్ రెడ్డిల పరిణయ వేడుకను యలహంక ఇంట్లో కాకుండా వేరే ప్రదేశంలో బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించాలని నిశ్చయించుకున్నట్లు ప్రకటించారు. కాబోయే నవదంపతులపై తెలుగు ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని ఆమె ఆకాంక్షించారు.








కామెంట్‌లు (0)