సూర్యుడు
అప్పుడే మేల్కొని
లేత కిరణాల కళ్లతో
లోకాన్ని చూస్తున్నాడు
ఆమె నిద్రముఖంతో
ఇంటిని చక్కదిద్ది
బక్కపల్చని దేహం
పొలంగట్టుకు చేరుతుంది
వారంతా
మహిళా కూలీలు
పొద్దున్నే పంటచేలో
పక్షుల్లా వాలుతుంటారు
చేలో వారి అడుగులు
నారుమళ్లవుతాయి
నారు నాటిన చేతివేళ్ళు
పచ్చని వరిపైరులా
కదలాడుతుంటాయి
వాళ్ళు నడుంను
విల్లులా వంచితేనే కదా
పైరు నిటారుగా నిలబడేది
ఆ కాళ్లకు పట్టిన బురదే కదా
పైరుకు పచ్చని జీవంపోసేది
దమ్ము చేసిన చేలో
వరినాట్లు వేస్తుంటే
నల్లని మట్టి పచ్చగా
పురుడుపోసుకుంటుంది
వారి చెమట చుక్కలు
వరికంకులవుతాయి
వారి శ్రమ
పండిన పంటవుతుంది
అలసిన ఎర్రని
దేహంతో సూర్యుడు
పడమరదిక్కు దిండుపై
మెల్లగా తలవాల్చే వేళ...
వాళ్లు ఇంటికెళ్ళినపుడు
మెతుకుల్లాంటి
ఆ చేతులే కంచంలో
అన్నం ముద్దలవుతాయి.
పొనుగుమట్ల అశోక్ కుమార్







కామెంట్‌లు (0)