హాయ్ ఫ్రెండ్స్!
నా పేరు బొజ్జా శర్వాణి. నేను విజయవాడలోని అంబిటస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచీ కూచిపూడి నాట్యమంటే చాలా ఇష్టం. అందుకే ఒకటో తరగతి నుంచే మధురానగర్‌లోని సాయిరామ్ నృత్య అకాడమీ ద్వారా మా గురువు భాగవతుల శ్రీనివాసశర్మ దగ్గర నృత్యరీతులు, నాట్యం నేర్చుకుంటున్నాను. కూచిపూడి నాట్య భంగిమలు, విన్యాసాలు తెలుసుకున్నాను. ఇప్పటివరకు నాలుగేళ్లుగా ఎన్నో చోట్ల నృత్య ప్రదర్శనలు ఇచ్చాను. తిరుమల కొండపైనా నాట్యం చేసే అవకాశం రావటం, నా ప్రదర్శన అద్భుతంగా రావటం, ప్రముఖులంతా అభినందించటం జీవితంలో మర్చిపోలేని సంఘటన. 2025 డిసెంబర్ 27న హైదరాబాద్‌లో జరిగిన ‘కూచిపూడి కళావైభవం’ కార్యక్రమంలో సుమారు 5,700 మంది కళాకారులతో కలిసి నేనూ నాట్యం చేశాను. ఇదే వేదికలో పాల్గొన్నందుకుగాను నా పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో నమోదైంది. ఇటీవల విజయవాడ దుర్గగుడిలో జరిగిన శరన్నవరాత్రి ఉత్సవాల్లోనూ నృత్య ప్రదర్శన ఇచ్చాను. మాతోపాటు మరికొందరు కళాకారిణులు చేసిన నృత్యాలను చూసి అక్కడికి వచ్చినవారు చాలా సంతోషించారు. ఆలయ అధికారులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మమ్మల్ని అభినందించారు. ఇప్పటివరకు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి సర్టిఫికెట్లు, జ్ఞాపికలు కూడా అందుకున్నాను. తిరుపతి, విజయవాడ, అన్నవరం, ద్వారకాతిరుమల దేవస్థానాల్లోనూ ఇచ్చిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. యాత్రికులు, ఆలయ అధికారులు, పాలకమండలి వారు నన్ను ఎంతగానో అభినందించి, జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించటం మధురానుభూతి. నా తండ్రి బొజ్జా కాంతికిరణ్ ఏపీ జెన్‌కోలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గానూ, తల్లి బొజ్జా మాధురి ఏపీ ఇరిగేషన్ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. మా అమ్మానాన్న నన్ను నాట్యం నేర్చుకోవడంలో ఎంతో ప్రోత్సహిస్తారు. వాళ్ల ప్రోత్సాహంతోనే ఎన్నో ప్రదర్శనల్లో పాల్గొనగలుగుతున్నాను. చిన్నప్పటి నుంచి తాతయ్య బొజ్జా అశోక్, నాయనమ్మ సుజాత నన్ను నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. మరింతగా రాణించాలని కోరుతూ దీవెనలు అందిస్తున్నారు.
నాకు కూచిపూడి నాట్యం నేర్చుకోవడమంటే చాలా ఇష్టం. ఇంకా బాగా సాధన చేసి, మరిన్ని మంచి ప్రదర్శనలు ఇవ్వాలని ఉంది. భవిష్యత్తులో మంచి నాట్య కళాకారిణిగా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ !
బొజ్జా శర్వాణి
5వ తరగతి,
అంబిటస్ ఇంటర్నేషనల్ స్కూల్,
విజయవాడ.







కామెంట్‌లు (0)