న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఎఐ) సాంకేతికత ఒకవైపు ఉద్యోగాలపై ప్రభావం చూపుతుండగా.. మరోవైపు అదే రంగంలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు, వాటి వ్యవస్థాపకులు, ప్రధాన వాటాదారుల సంపదను భారీగా పెంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య, వారి సంపద 2025లో రికార్డు స్థాయికి చేరినట్లు గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ అల్ట్రాటా (Altrata) తాజా Billionaire Census 2026 నివేదిక వెల్లడించింది.
2025 నాటికి ప్రపంచంలో బిలియనీర్ల సంఖ్య 3,795కు చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 8.2 శాతం పెరుగుదల. వీరి ఉమ్మడి సంపద 12.8 శాతం పెరిగి 15.1 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.1,417 లక్షల కోట్లకు పైగా. గత దశాబ్దంలో బిలియనీర్ల సంఖ్య దాదాపు 60 శాతం పెరగడం గమనార్హం.
ఎఐ పెట్టుబడులతో మార్కెట్ విలువకు ఊతం
బిలియనీర్ల సంపద పెరగడంలో ఎఐ రంగంలో పెరిగిన పెట్టుబడులు కీలక పాత్ర పోషించాయని అల్ట్రాటా పేర్కొంది. బిలియనీర్ల సంపదకు అత్యధికంగా దోహదపడుతున్న ప్రపంచంలోని 150 లిస్టెడ్ కంపెనీలను పరిశీలించగా.. ఎఐలో గణనీయంగా పెట్టుబడులు పెట్టిన కంపెనీల మార్కెట్ విలువ 2024-25లో, ఎఐలో అంతగా పెట్టుబడి పెట్టని కంపెనీలతో పోలిస్తే 23 శాతం వేగంగా పెరిగింది. దీంతో ఆయా సంస్థల వ్యవస్థాపకులు, ప్రధాన వాటాదారుల వ్యక్తిగత సంపద కూడా గణనీయంగా పెరిగింది. అయితే కుబేరుల సంపద పెరగడానికి ఎఐ ఒక్కటే కారణం కాదని నివేదిక స్పష్టం చేస్తోంది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో రెండంకెల వృద్ధి, ప్రధాన కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల తగ్గింపులు, ఇతర ఆస్తుల విలువ పెరగడం కూడా సంపద పెరుగుదలకు దోహదపడ్డాయి.

29 మంది వద్దనే 27 శాతం సంపద ...!
ప్రపంచ బిలియనీర్లలో సంపద కేంద్రీకరణ మరింత తీవ్రమవుతోంది. 50 బిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన 29 మంది ‘సూపర్ బిలియనీర్ల’ వద్ద కలిపి 4.1 ట్రిలియన్ డాలర్ల సంపద ఉంది. అంటే ప్రపంచ బిలియనీర్ల మొత్తం సంపదలో 27.2 శాతం కేవలం 29 మంది చేతుల్లోనే ఉంది. 2017లో 50 బిలియన్ డాలర్లకు పైగా సంపద కలిగిన వారు కేవలం 10 మంది ఉండగా.. వారి వాటా మొత్తం బిలియనీర్ల సంపదలో 7.2 శాతంగా ఉండేది.
ఉత్తర అమెరికాదే అగ్రస్థానం ...!
ప్రాంతాల వారీగా చూస్తే 1,337 మంది బిలియనీర్లతో ఉత్తర అమెరికా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ బిలియనీర్లలో ఇది 35 శాతం. 1,081 మందితో యూరప్ రెండో స్థానంలో, 881 మందితో ఆసియా మూడో స్థానంలో ఉన్నాయి. ఉత్తర అమెరికాలో బిలియనీర్ల సంఖ్య 11.6 శాతం, యూరప్‌లో దాదాపు 8 శాతం, ఆసియాలో 6.5 శాతం పెరిగింది. దేశాల వారీగా చూస్తే అమెరికాలోనే అత్యధికంగా 1,265 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచ బిలియనీర్లలో దాదాపు మూడో వంతు అమెరికాలోనే ఉన్నారు.
మహిళలు కేవలం 13 శాతమే ...
ప్రపంచ బిలియనీర్లలో మహిళల వాటా ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. మొత్తం బిలియనీర్లలో కేవలం 13 శాతం మాత్రమే మహిళలు. మరోవైపు బిలియనీర్ల సగటు వయసు 71 సంవత్సరాలు కాగా, 50 ఏళ్లలోపు వారు కేవలం 9 శాతం మాత్రమే ఉన్నారు.
సంపద పెరుగుతున్నా.. అంతరం కూడా పెరుగుతోంది ....
అల్ట్రాటా గణాంకాలు ఒక కీలక వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలో సంపద సృష్టి వేగంగా జరుగుతున్నప్పటికీ.. దాని ప్రయోజనాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా చేరడం లేదు. ముఖ్యంగా సాంకేతిక, ఎఐ ఆధారిత కంపెనీల షేర్ల విలువ పెరగడం వల్ల ఇప్పటికే భారీ ఆస్తులు కలిగిన వ్యవస్థాపకులు, పెట్టుబడిదారుల సంపద మరింత వేగంగా పెరుగుతోంది. ఫలితంగా అత్యంత సంపన్నుల చేతుల్లో సంపద కేంద్రీకరణ మరింత పెరుగుతున్నది. అంటే.. ఎఐ ఉత్పాదకత, సాంకేతిక సామర్థ్యాలను పెంచుతున్న సమయంలోనే దాని ఆర్థిక ప్రయోజనాలు ఎవరికి ఎక్కువగా దక్కుతున్నాయన్న ప్రశ్న కూడా ముందుకొస్తోంది. ఉద్యోగాలపై ఎఐ ప్రభావం, సంపద పంపిణీ, సాంకేతిక లాభాల్లో సామాజిక భాగస్వామ్యం వంటి అంశాలు భవిష్యత్తులో మరింత కీలకంగా మారనున్నాయి.







కామెంట్‌లు (0)