- మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వానికి రైతు సంక్షేమంపై జగన్ పాఠాలు చెప్పడం ‘దెయ్యాలు వేదాలు వల్లించినట్టు’ ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఎద్దేవ చేశారు. రాయలసీమకు పెట్టుబడులు రావడం, రైతులకు మెరుగైన ఆదాయం కల్పించే ప్రయత్నాలు జరగడం కూడా తప్పుగానే కనిపిస్తోందా అని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. తాడేపల్లిలో కూర్చొని రాజకీయ విమర్శలు చేయడం కంటే, రైతుల కష్టాలు, వారి సమస్యలు, కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై వాస్తవాలను తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. లక్ష కోట్ల పెట్టుబడులకు, రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులకు తేడా తెలియకుండా మాజీ సీఎం జగన్ విమర్శలు చేయడం సరికాదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – రైజింగ్ రాయలసీమలో భాగంగా పూర్వోదయ పథకం ద్వారా సుమారు రూ.40 వేల కోట్లు, ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులు సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.







కామెంట్‌లు (0)