ఇస్లామాబాద్ : జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్‌కు మానవతా దృక్పథంతో కూడిన చికిత్స, సరైన వైద్య సంరక్షణ అందించాలని 21 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ సహా 20 మంది మాజీ కెప్టెన్లు ఈ విజ్ఞప్తిపై సంతకాలు చేశారు. ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనకరమైన వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు ఈ విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై భారత మాజీ కెప్టెన్లు పద్మభూషణ్ సునీల్ గవాస్కర్, పద్మభూషణ్ కపిల్‌దేవ్ నిఖంజ్, పద్మశ్రీ దిలీప్ వెంగ్‌సర్కార్ సంతకాలు చేశారు. మైఖేల్ అథర్టన్, అలెక్స్ బ్లాక్‌వెల్, అలన్ బోర్డర్, మైఖేల్ బ్రియర్లీ, గ్రెగ్ చాపెల్, ఇయాన్ చాపెల్, బెలిండా క్లార్క్, సర్ అలస్టైర్ కుక్, లీ జెర్మన్, ఆడమ్ గిల్క్రిస్ట్, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, నాసర్ హుస్సేన్, సర్ క్లైవ్ లాయిడ్, దేశమాన్య అర్జున రణతుంగ, సర్ ఆండ్రూ స్ట్రాస్, స్టీఫెన్ వా, జాన్ రైట్ తదితరులు సంతకం చేసిన వారిలో ఉన్నారు. ఆరు నెలల క్రితం 14 మంది మాజీ అంతర్జాతీయ కెప్టెన్లు ఇమ్రాన్‌ఖాన్‌కు మానవతా దృక్పథంతో చికిత్స, తగిన వైద్య సంరక్షణ అందించాలని కోరుతూ పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని వారు గుర్తుచేశారు. తాము రాజకీయ నేతలుగా కాకుండా, క్రికెట్ మైదానంలో ఏర్పడిన బంధాన్ని పంచుకునే మాజీ సహచరులు, ప్రత్యర్థులుగా ఆ లేఖ రాశామని తెలిపారు. ఆ బంధం దేశ సరిహద్దులు, వివాదాలకు అతీతమైనదని పేర్కొన్నారు. ఇప్పుడు మరో ఏడుగురు మాజీ కెప్టెన్లతో కలిసి తమ విజ్ఞప్తిని పునరుద్ఘాటిస్తున్నామని తెలిపారు.
ఇమ్రాన్‌ఖాన్‌ను ఆసుపత్రికి తరలించి, ఆయన వ్యక్తిగత వైద్యులు, సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌తో కూడిన వైద్య బృందం ద్వారా పరీక్షించాలని పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశించిందని మాజీ కెప్టెన్లు పేర్కొన్నారు. వారానికి ఒకసారి కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా కోర్టు అనుమతించిందని తెలిపారు. ఈ ఆదేశాలను స్వాగతిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇమ్రాన్‌ఖాన్‌ను ఆస్పత్రిలో కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉంచారని ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశించిన వైద్య బృందానికి బదులుగా ప్రభుత్వం నియమించిన బృందం ఆయనను పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించిందని, అనంతరం తిరిగి అడియాలా జైలుకు తరలించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశించిన వైద్య బృందం, ఇమ్రాన్‌ఖాన్ వ్యక్తిగత వైద్యులతో సహా, ఆయన ఆరోగ్యంపై పూర్తి, స్వతంత్ర వైద్య పరీక్ష నిర్వహించేలా చూడాలని వారు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా ఆయన కుడి కంటి చూపు కోల్పోయినట్లు వస్తున్న వార్తలపై సమగ్రంగా వైద్య అంచనా వేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే , సుప్రీంకోర్టు పునరుద్ధరించిన వారానికి ఒకసారి కుటుంబ సభ్యుల సందర్శనలను ఎలాంటి అంతరాయం, పాలనా జోక్యం లేకుండా కొనసాగించాలని కోరారు. వైద్య పరీక్షల అనంతరం వైద్య బృందం సిఫార్సు చేసిన చికిత్సను ఎలాంటి జాప్యం లేకుండా అందించాలని స్పష్టం చేశారు. ఇమ్రాన్‌ఖాన్ గత మూడేళ్లకు పైగా నిర్బంధంలో ఉన్నారని మాజీ కెప్టెన్లు పేర్కొన్నారు. ఆయన కేసుకు సంబంధించిన న్యాయపరమైన, రాజకీయ అంశాలపై తీర్పు చెప్పడం తమ ఉద్దేశం కాదని, అది తమ పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశించిన వైద్య ప్రక్రియ వాస్తవంగా పూర్తయ్యేలా చూడాలని మాత్రమే తాము కోరుతున్నామని తెలిపారు. ఇది వివాదాస్పదమైన అభ్యర్థన కాదని పేర్కొన్నారు. “ఈ ఆట ఆడే ప్రతి దేశం దీనిని న్యాయమైనదిగా గుర్తిస్తుందని మేము నమ్ముతున్నాం. ఈ విషయాన్ని త్వరితగతిన, ఇమ్రాన్‌ఖాన్‌కు తగిన గౌరవంతో పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం” అని మాజీ కెప్టెన్లు పేర్కొన్నారు.
1992 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌కు తొలిసారి ప్రపంచకప్ అందించిన కెప్టెన్‌గా ఇమ్రాన్‌ఖాన్ క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేశారు. 2023 ఆగస్టు నుంచి ఆయన జైలులో ఉన్నారు. తనపై నమోదైన కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని ఇమ్రాన్‌ఖాన్ వర్గం ఆరోపిస్తోంది.








కామెంట్‌లు (0)