బెర్లిన్ : జర్మనీలో జూన్ నెల చివరలో సంభవించిన తీవ్ర వేడిగాలుల ప్రభావంతో 5,000కు పైగా అదనపు మరణాలు నమోదైనట్లు ప్రాథమిక గణాంకాలు మంగళవారం వెల్లడించాయి. ఫెడరల్ గణాంక కార్యాలయం డెస్టాటిస్ మంగళవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, జూన్ నెలలోని చివరి పూర్తి వారంలో నమోదైన మరణాల సంఖ్య 2022–2025 మధ్యకాలపు అదే వారాల మధ్యస్థ మరణాల కంటే 5,486 అధికంగా ఉంది. ఆ వారంలో దేశవ్యాప్తంగా తీవ్రమైన వడగాలులు కొనసాగగా, ఉష్ణోగ్రతలు 41.7 డిగ్రీల సెల్సియస్ (107.1 డిగ్రీల ఫారెన్‌హీట్)కు చేరుకుని జాతీయ రికార్డును నమోదు చేశాయి. ఈ అసాధారణ ఉష్ణోగ్రతల ప్రభావమే అదనపు మరణాలకు ప్రధాన కారణంగా నిపుణులు భావిస్తున్నారు. వేడి సంబంధిత మరణాలపై సమగ్ర అంచనాను జర్మనీకి చెందిన రాబర్ట్ కోచ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌కెఐ) ఈ వారం చివర్లో విడుదల చేయనుంది. ఈ గణాంకాలు యూరప్ అంతటా కొనసాగుతున్న తీవ్రమైన ఉష్ణోగ్రతల వల్ల కలుగుతున్న ప్రాణనష్టానికి తాజా నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రపంచంలో అత్యంత వేగంగా వేడెక్కుతున్న ఖండంగా మారుతున్న యూరప్‌లో వాతావరణ మార్పుల ప్రభావంతో వడగాలుల తీవ్రత, ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజారోగ్యంతో పాటు రవాణా, విద్యుత్ వ్యవస్థలపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. స్పెయిన్, ఫ్రాన్స్‌లలో కూడా ఇటీవల వేల సంఖ్యలో వేడి సంబంధిత మరణాలు నమోదైనట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
అధిక మరణాలకు వేడికి మధ్య సంబంధం ఉందని హెల్మ్‌హోల్ట్జ్ మ్యూనిచ్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ డిప్యూటీ డైరెక్టర్ అలెగ్జాండ్రా ష్నైడర్ పేర్కొన్నారు. 2003లో యూరప్‌ను తాకిన తీవ్ర వడగాలుల సమయంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజుల్లోనే కాకుండా, ఆ తర్వాతి రోజుల్లో కూడా మరణాల సంఖ్య గణనీయంగా పెరిగిందని అన్నారు. సాధారణంగా ఆరోగ్యంగా వున్నవారు వేడిని తట్టుకునే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ఇప్పటికే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, వృద్ధులు, శిశువులు, అలాగే సామాజికంగా ఒంటరిగా జీవించే వ్యక్తులపై తీవ్ర ప్రమాదం ఉంటుందని అన్నారు. వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి వుందని, తగిన వైద్య చికిత్స అవసరమని ఆమె పేర్కొన్నారు.
యూరప్‌లోనూ అధిక ఉష్ణోగ్రతలు
యూరప్‌లో మరోసారి తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఫ్రాన్స్ వడగాల్పులకు కేంద్రంగా మారగా, జర్మనీలో కూడా ఈ వారం, వచ్చే వారం సాధారణ స్థాయికంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వాలు సమర్థవంతమైన వేడి నిర్వహణ ప్రణాళికలను అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.








కామెంట్‌లు (0)