గాజా : పాలస్తీనా మీడియాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్ దాడులను ప్రెస్ యూనియన్ ఖండించింది. 2026 మొదటి ఆరు నెలల్లో మీడియాపై ఇజ్రాయిల్ ఆక్రమణ దళాలు 467 ఉల్లంఘనలకు పాల్పడినట్లు పాలస్తీనియన్ జర్నలిస్ట్స్ సిండికేట్ (పిజెఎస్) సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. 8మంది జర్నలిస్టుల హత్య, 25మందిని ఏకపక్షంగా అరెస్ట్ చేయడంతో పాటు సెన్సార్‌షిప్, పరికరాల జప్పుకు సంబంధించి 192 కేసులు ఉన్నట్లు పేర్కొంది. హత్యలు, నిర్బంధాలు, శారీరక హింస, సజీవదహనం, జర్నలిస్టులను ఉద్దేశ్యపూర్వకంగా అడ్డుకోవడం వంటివి ఈ ఉల్లంఘనల్లో ఉన్నాయని తెలిపింది. 192 కేసుల్లో 41శాతానికి పైగా కేసులు ఉల్లంఘనలకు సంబంధించినవని పేర్కొంది. పాలస్తీనాపై దీర్ఘకాలిక శత్రుభావం నెలకొన్న విధానాన్ని ఈ గణాంకాలు వెల్లడించాయని పిజెఎస్ తెలిపింది. నెలవారీ గణాంకాలను పరిశీలిస్తే.. ఫిబ్రవరిలో జర్నలిస్టులపై అత్యధికంగా 122 దాడి ఘటనలు నమోదు కాగా, జనవరిలో 109, మార్చిలో 53, ఏప్రిల్ 39, మే55, జూన్ 89 ఘటనలు నమోదయ్యాయి. మొదటి రెండు నెలల్లో నమోదైన తీవ్ర పెరుగుదల, ఉత్తర గాజా స్ట్రిప్‌లో తీవ్రమైన ఇజ్రాయిల్ సైనిక చర్యలను వెల్లడిస్తోంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జబాలియా, బీల్ లహియా, బీట్ హనౌన్‌ల్లో జరిగిన భూతల చొరబాట్లు, ప్రాణనష్టం, మౌలిక సదుపాయాల విధ్వంసాన్ని నమోదు చేయడానికి యత్నిస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు ఈ గణాంకాలు వెల్లడించాయని తెలిపింది.
గాజా స్ట్రిప్, ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌ల్లో జర్నలిస్టులు ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులను ఈ గణాంకాలు వెల్లడించాయని యూనియన్ కమిషన్ డైరెక్టర్ ముహమ్మద్ అల్-లహమ్ పునరుద్ఘాటించారు. ప్రతి గణాంకం సమాచారం అందించే హక్కును హింసాత్మకంగా నిరాకరించిన ఒక జర్నలిస్టును సూచిస్తుందని అన్నారు. 8మంది జర్నలిస్టులు హత్యకు గురికావడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. 2023 అక్టోబర్‌లో ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం 264మంది మీడియా కార్యకర్తలు సైన్యం చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఈ ఆరునెలల్లో పాలస్తీనాలో జర్నలిస్టులపై జరిగిన శారీరక వేధింపుల్లో 27 ఏకపక్ష అరెస్టులు, 29 లక్షిత కాల్పుల ఘటనలు, టియర్‌గ్యాస్ స్టన్ గ్రెనేడ్‌లతో 78 దాడులు ఉన్నాయి. 257 తుపాకీ కాల్పులను కూడా నమోదు చేసినుట్ల తెలిపింది. అంటే నాలుగింట ఒకవంతు కంటే ఎక్కువ సార్లు ఇజ్రాయిల్ దళాలు నేరుగా జర్నలిసస్టులపై ఆయుధాలను గురిపెట్టాయని తెలిపింది.








కామెంట్‌లు (0)