న్యూయార్క్ : నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై న్యూఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ కు అమెరికాలోనూ మద్దతు లభిస్తోంది. న్యూయార్క్, శాన్‌జోస్ నగరాల్లో ‘‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’’ సంస్థ కార్యకర్తలు నిరసన చేపట్టారు. న్యూయార్క్ నగరంలోని యూనియన్ స్క్వేర్ వద్ద, శాన్ జోస్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వాంగ్‌చుక్‌కు మద్దతుగా ఆందోళనకారులు పెద్ద ఎత్తున గుమికూడి వాంగ్‌చుక్‌కు మద్దతుగా నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. భారత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారత కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కోరారు. లండన్‌లోని భారత హై కమిషన్, డబ్లిన్‌లోని రాయబార కార్యాలయం ఎదుట కూడా నిరసనలు జరిగాయని సంస్థ వెల్లడించింది. లండన్‌లోని భారత హైకమిషన్, డబ్లిన్‌లోని భారత రాయబార కార్యాలయం బయట కూడా సోనమ్ వాంగ్ చుక్ కు మద్దతుగా సంఘీభావ ప్రదర్శనలు జరిగాయని హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. "న్యూయార్క్‌లో అయినా, లండన్‌లో అయినా, శాన్ జోస్ లోనైనా డబ్లిన్‌లో అయినా తమ నిరసనలు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపాయని పేర్కొంది. భారతదేశ విద్యార్థులు న్యాయంగా, గౌరవంగా చూడబడటానికి అర్హులు. భారత యువతకు నిజాయితీతో కూడిన సమాధానాలు, వారు విశ్వసించగల భవిష్యత్తు అవసరం. భారత పౌరులు బహిరంగ చర్చలు, సంస్కరణలకు అర్హులు, భారత ప్రభుత్వం జవాబుదారీతనం వహించాల్సిన సమయం ఆసన్నమైంది." అని హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ స్పష్టం చేసింది. త్వరలోనే తాము వాంగ్‌చుక్, ఇతర నిరసనకారులను సంప్రదించేందుకు అనుమతినివ్వాలని హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది.
PROTESTS - వాంగ్ చుక్ కు మద్దతుగా అమెరికాలోనూ నిరసనలు
22 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 22, 2026, 11:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)