కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికాలోని రెండు పెద్ద నగరాల్లో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో 27మంది మరణించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. జోహన్నెస్‌బర్గ్‌కు నైరుతి దిశలో ఉన్న వెడెలా టౌన్‌షిప్‌లోని ఒక బార్‌లో శనివారం రాత్రి కాల్పులు జరిగాయి. ఎకె-47 రైఫిళ్లు, పిస్టల్స్‌తో సుమారు ఎనిమిది మంది దుండగులు జరిపిన కాల్పుల్లో 17మంది మరణించినట్లు దక్షిణాఫ్రికా పోలీస్ సర్వీస్ తెలిపింది. ఈ దాడిలో మరో 15మంది గాయపడ్డారని పేర్కొంది. కేప్‌టౌన్ సమీపంలోని లాండ్లేలో ఆదివారం తెల్లవారుజామున సుమారు ఒంటి గంట సమయంలో ఒక దుకాణంలో జరిగిన కాల్పుల్లో పది మంది మరణించినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో మరో 11మంది గాయపడ్డారని తెలిపింది. అనుమానితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
డర్బన్ సమీపంలో ఒక హౌస్ పార్టీలో ముగ్గురు దుండగులు జరిపిన సామూహిక కాల్పుల్లో గర్భిణీ సహా 11 మంది మరణించిన కొద్ది రోజులకే ఈ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.







కామెంట్‌లు (0)