వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా వీసా అపాయింట్‌మెంట్లను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది. ట్రంప్ రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత, వలసదారులపై కఠిన చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో ఒక శిక్షణా కార్యక్రమాన్ని పార్రంభించినట్లు, ఈ శిక్షణకు అనుగుణంగా వీసాల అపాయింట్‌మెంట్‌లను సర్దుబాటు చేయనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మంగళవారం తెలిపారు. అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసుకున్న ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తుదారులకు, వారి అపాయింట్‌మెంట్‌లు వాయిదా వేసినట్లు ఈమెయిల్స్‌లో వెల్లడించారు. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆ మెయిల్స్‌లో పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వ ప్రయోజనాలపై ఆధారపడే అవకాశం ఉన్న దరఖాస్తుదారులను గుర్తించడంలో కాన్సులర్ అధికారులకు సహాయపడటం, అలాగే వీసా దరఖాస్తుదారుల పరిశీలన సమగ్రంగా, ఏకరీతిగా జరిగేలా చూడటం ఈ శిక్షణ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ శిక్షణకు సంబంధించిన వివరాలను లేదా ఎంత కాలం కొనసాగుతుంది అన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. దేశ భద్రతను మెరుగుపరచడమే ఈ చర్యల ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.
అయితే, ఈ చర్యలకు కొన్ని న్యాయపరమైన అడ్డంకులు ఎదురయ్యాయి. 75 దేశాల దరఖాస్తుదారులకు ఇమిగ్రెంట్ వీసాల జారీని నిలిపివేస్తూ ట్రంప్ యంత్రాంగం తీసుకున్న విధానం, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోకు చట్టపరంగా ఉన్న అధికార పరిధిని మించి ఉందని పేర్కొంటూ... అమెరికా న్యాయమూర్తి ఒకరు గతవారం ఆ విధానాన్ని రద్దు చేశారు. ట్రంప్ వలసల నియంత్రణ చర్యలు వివక్షాపూరితమైనవని, భావ ప్రకటనా స్వేచ్ఛ, న్యాయబద్ధమైన విచారణ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి.







కామెంట్‌లు (0)