ఘనంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం
ప్రజాశక్తి పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా 13 వేల మంది గిరిజన బాలికలు ప్రదర్శించిన థింసా నృత్యం – గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి చరిత్ర సృష్టించింది. అల్లూరి, మన్యం జిల్లాల కలెక్టర్లు ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారుల పర్యవేక్షణలో ఆశ్రమ విద్యార్థినీలు చేసిన నృత్యం థింసా నృత్య ప్రదర్శన తో విమానాశ్రయ ప్రారంభోత్సవ సంబరం అంబరాన్ని తాకింది. ఈ ఘనతతో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజనుల సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు లభించింది.
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, అల్లూరి జిల్లా కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ పూజ ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ జీసీసీ చైర్మన్ కె. శ్రవణ్ కుమార్ హర్షాతిరేకం వ్యక్తం చేశారు. ఈ అపూర్వ విజయానికి కృషి చేసిన , జిల్లా యంత్రాంగానికి, నిర్వాహకులు, కళాకారులు, గిరిజన సోదర సోదరీమణులు, పాల్గొన్న 13 వేల మంది ఆదివాసి బాలికలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డు అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజనుల సాంస్కృతిక వైభవానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిందని, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఈ అపూర్వ విజయంతో జిల్లా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, కళా వైభవం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రచారం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు..
పాడేరులో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా వీక్షించిన ప్రజలు ....
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా పాడేరులో పట్టణ ప్రజలు శనివారం వీక్షించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేలా అల్లూరి సీతారామరాజు జిల్లా పాత బస్టాండ్ కూడలిలోని అన్నా క్యాంటీన్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌పై కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఎల్‌ఈడీ స్క్రీన్ వద్దకు చేరుకుని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఆసక్తిగా వీక్షించారు.
రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని ప్రజలు హర్షాతిరేకాలతో స్వాగతించారు.
ప్రధాని మోడి కి బొబ్బిలి వీణ, పొందూరు ఖాదీలను బహుకరించిన సిఎం చంద్రబాబు ....
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు సంస్కృతికి ప్రతీకలైన బొబ్బిలి వీణతో పాటు పొందూరు ఖాదీ వస్త్రాన్ని బహూకరించారు. 300 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బొబ్బిలి వీణను బొబ్బిలి సమీపంలోని గొల్లపల్లి గ్రామ కళాకారులు ఒకే పనస చెట్టు మొద్దుతో ఎంతో నైపుణ్యంతో తయారు చేస్తారు. ఈ ప్రత్యేక హస్తకళకు జీ1 ట్యాగ్ కూడా లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన పొందూరు ఖాదీను చేతితో ఏకిన పత్తితో, సంప్రదాయ పద్ధతిలో నేస్తారు. నాణ్యత, మృదుత్వానికి ఇది ప్రత్యేక గుర్తింపు పొందింది. భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త ద్వారం అయితే… ఈ వేడుకలో ప్రధానికి కానుకగా సమర్పించిన బొబ్బిలి వీణ, పొందూరు ఖాదీ మన తెలుగు వారసత్వం, కళా వైభవం, సంస్కృతికి ప్రతీకలుగా నిలిచాయి.








కామెంట్‌లు (0)