ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బోటు బోల్తా.. ప్రాణాలతో బయటపడ్డ కారి చిన్న

59 నిమిషాల క్రితం

chinna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 10:21 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మరో ఆరుగురి కోసం గాలింపు

ప్రజాశక్తి-విశాఖపట్నం: విశాఖ తీరం నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సముద్రంలో వేట సాగిస్తున్న సమయంలో అలల తాకిడికి గురై మత్స్యకారుల బోటు బోల్తా పడినట్లు అధికారికంగా తెలిసింది. ఈ ప్రమాదం నుంచి మత్స్యకారుడు కారి చిన్న అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో సముద్రంలో ఉన్న మరో బోటు సిబ్బంది ఆయనను సురక్షితంగా రక్షించి, ప్రస్తుతం బోటులోనే అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత ఉధృతం చేశారు. ఒకరు సురక్షితంగా దొరకడంతో మిగిలిన వారు కూడా క్షేమంగా తిరిగిరావాలని, రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేయాలని మత్స్యకార కుటుంబ సభ్యులు అధికారులను వేడుకుంటున్నారు. తమ వారి పరిస్థితిపై కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇప్పటికే నేవీ హెలికాప్టర్లు, కోస్ట్‌గార్డ్ నౌకలు, మెరైన్ పోలీసులు సముద్రంలో విస్తృతంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బోటు బోల్తా పడిన ప్రాంతాన్ని ల్యాండ్‌మార్క్‌గా తీసుకుని, మిగిలిన ఆరుగురి కోసం గాలింపు ముమ్మరం చేశారు.


సంబంధిత వార్తలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్