బెంగళూరు : 2028 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనని కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య (79) ఆదివారం ప్రకటించారు. వయసు పెరగడం, ఆరోగ్యం బలహీనపడటం, రాజకీయాల్లో అవినీతి పెరగడమే ఇందుకు కారణమని చెప్పారు. ఎక్స్‌లో చేసిన పోస్టులో సిద్ధరామయ్య, ప్రజా జీవితంలో చురుగ్గా కొనసాగుతానని, కానీ ఇక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. "రాజకీయ రంగం అవినీతిమయంగా మారిపోయింది. అందుకే నేను 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అయితే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ప్రజల కష్టసుఖాలకు గొంతుకగా నిలుస్తాను" అని పేర్కొన్నారు. తన వరుణ నియోజకవర్గ ప్రజలు మరోసారి పోటీ చేయాలని కోరుతున్నారని, కానీ ఇకపై ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. తన నిర్ణయానికి కారణం వివరిస్తూ.. ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం ముగిసి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయానికి తన వయసు 81 లేదా 82 ఏళ్లు ఉంటుందని సిద్ధరామయ్య తెలిపారు. "ఇప్పుడు నా వయసు 79 ఏళ్లు. మా ప్రభుత్వ పదవీకాలం ముగియడానికి ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అప్పటికి నాకు 81-82 ఏళ్లు వస్తాయి. నా ఆరోగ్యం గతంలో ఉన్నంత బలంగా లేదు. ఇంతకుముందులా అదే ఉత్సాహంతో పని చేయడం ఇక సాధ్యం కాదు" అని అన్నారు. సిద్ధరామయ్య తన 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానం గురించి కూడా ప్రస్తావించారు. 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ప్రజా జీవితంలో అడుగుపెట్టానని, 2028తో ఆ ప్రయాణానికి 50 ఏళ్లు పూర్తవుతాయని చెప్పారు. "ఓటములు, విజయాలు రెండూ చూశాను. కానీ నేను నమ్మిన సిద్ధాంతాలకు విరుద్ధంగా ఎప్పుడూ వ్యవహరించలేదు. నా మనస్సాక్షిని ఎప్పుడూ మోసం చేయలేదు అన్న సంతృప్తి నాకు ఉంది" అని చెప్పారు. ఎన్నికల రాజకీయాల తీరు మారిపోయిందని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. "ఎన్నికల్లో పోటీ చేయాలంటే ప్రజలకు డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు రాజకీయాలు పూర్తిగా అవినీతిమయంగా మారిపోయాయి. నిజాయితీ రాజకీయాలకు నిలదొక్కుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇకపై ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను" అని పేర్కొన్నారు. ఎన్నికల రాజకీయాలకు వీడ్కోలు ప్రకటించినా.... ప్రజల కోసమే పని చేస్తానని సిద్ధరామయ్య చెప్పారు. "50 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలు నన్ను తమలో ఒకడిగా భావించి ప్రేమతో నడిపించారు. ఆ రుణం నా మీద ఉంది. అందుకే నా మిగిలిన జీవితం కూడా ప్రజా సేవకే అంకితం" అని పోస్టులో పేర్కొన్నారు.
ఇక ఎన్నికల్లో పోటీ చేయను : సిద్ధరామయ్య
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 26, 2026, 04:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)