ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హిమాచల్‌లో ప్రాథమిక ఉపాధ్యాయుల భారీ ఆందోళన.. నిరవధిక రిలే నిరాహార దీక్ష ప్రారంభం

1 గంట క్రితం

hpptf
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 05:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

సిమ్లా : హిమాచల్ ప్రదేశ్‌లో వేలాది మంది ప్రాథమిక ఉపాధ్యాయులు ఆదివారం సిమ్లాలోని చారిత్రాత్మక చౌరా మైదానంలో నిరవధిక నిరాహారదీక్ష‍ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 రోజుల పాదయాత్రను ముగించి, నేడు సిమ్లా చేరుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న 'స్కూల్ కాంప్లెక్స్ సిస్టమ్'‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ నెరవేరేంతవరకు నిరాహార దీక్ష‍ చేపడతామని స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్య (హెచ్‌పిపిటిఎఫ్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో ప్రస్తుత, పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులతో పాటు మధ్యాహ్న భోజన పథకం సిబ్బంది, బహుళ విధుల కార్మికులు, ఇతర విద్యా శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. పాంగీ, డోడ్రా క్వార్ వంటి మారుమూల గిరిజన ప్రాంతాల ఉపాధ్యాయులు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో అమలు చేసిన 'స్కూల్ కాంప్లెక్స్ సిస్టమ్'ను వెంటనే రద్దు చేయాలని హెచ్‌పిపిటిఎఫ్‌ డిమాండ్ చేస్తోంది. ఈ విధానంలో పలు ప్రాథమిక, మాధ్యమిక, సీనియర్ సెకండరీ పాఠశాలలను ఒకే పరిపాలనా అధికారి ఆధ్వర్యంలోకి తీసుకువచ్చారని, దీంతో ప్రాథమిక పాఠశాలల స్వయం ప్రతిపత్తి దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఉపాధ్యాయుల నియామకాలు, బోధన వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడిందని హెచ్‌పిపిటిఎఫ్‌ మండిపడింది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 'ప్రాథమిక విద్యను కాపాడండి' పాదయాత్ర షిమ్లాలో విజయవంతంగా ముగిసిందని హెచ్‌పిపిటిఎఫ్‌ అధ్యక్ష‍ుడు రమేష్‌ శర్మ పేర్కొన్నారు. కొత్త వ్యవస్థ కారణంగా గతంలో ఒక్కో పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉండగా, ఇప్పుడు 15 నుంచి 20 పాఠశాలలను ఒకే ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారని తెలిపారు. దీని ప్రభావంతో జేబీటీ, నర్సరీ ఉపాధ్యాయులతో పాటు ఇతర సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సుమారు 200 ప్రాథమిక పాఠశాలలు ఉపాధ్యాయుల కొరతతో నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. సిమ్లాలోని పాఠశాల విద్యా డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట ఆదివారం నుంచి ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులు నిరవధిక రిలే నిరాహార దీక్ష ప్రారంభించినట్లు వెల్లడించారు.

ప్రభుత్వం తమ న్యాయబద్ధమైన డిమాండ్లను అంగీకరించి స్కూల్ కాంప్లెక్స్ వ్యవస్థను ఉపసంహరించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని రమేష్ శర్మ స్పష్టం చేశారు. గతంలో విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలతో ఉద్యమాన్ని విరమించినప్పటికీ, అవి అమలు కాలేదని ఆరోపించారు. విద్యార్థుల చదువులకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో వేసవి సెలవుల సమయంలోనే ఈ ఆందోళన చేపట్టామని, ప్రాథమిక విద్యను కాపాడటం తమ లక్ష్యమని ఆయన అన్నారు. ఆదివారం నిర్వహించిన నిరసనలో 15 వేల మందికి పైగా పాల్గొన్నట్లు తెలిపారు. అలాగే ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు ఉపాధ్యాయులు నివాళులర్పించారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ఉద్యమ స్థలానికి వచ్చి స్కూల్ కాంప్లెక్స్ సిస్టమ్ ఉపసంహరణను ప్రకటించాలని మండి జిల్లాలోని కర్సోగ్‌కు చెందిన విభిన్న ప్రతిభావంతుడైన ప్రాథమిక ఉపాధ్యాయుడు ప్రకాశ్ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం సుమారు 20 వేల మంది ప్రాథమిక ఉపాధ్యాయులు పనిచేస్తుండగా, సుమారు 40 వేల మంది పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు సహా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర ఉద్యోగులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారని హెచ్‌పిపిటిఎఫ్‌ పేర్కొంది. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్