న్యూఢిల్లీ : తమ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సిజెపి ప్రధాన ప్రతినిధి సౌరవ్‌దాస్ పేర్కొన్నారు. దీప్కేను పోలీసులు అదుపలోకి తీసుకున్నారని ఎక్స్ పోస్ట్‌లో ఆయన వెల్లడించారు. ఆందోళన చేపడుతున్న విద్యార్థులకు ఎంపిలు మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన చేపడుతున్న విద్యార్థులను అణచివేసేందుకు పోలీసులు క్రూరంగా లాఠీచార్జ్ చేశారని అన్నారు.
సిజెపి నిరసనకారులపై విరుచుకుపడిన పోలీసులు .. టియర్ గ్యాస్ ప్రయోగం
న్యూఢిల్లీ : పార్లమెంటును ముట్టడించేందుకు యత్నించిన సిజెపి ఆందోళనకారులపై పోలీసులు విరుచుకుపడ్డారు. సిజెపి పిలుపు మేరకు పార్లమెంటుకు ర్యాలీగా వెళుతున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రెస్‌క్లబ్ సమీపంలో వారిని చెదరగొట్టేందుకు టియర్‌గ్యాస్ ప్రయోగించారు.
సీజేపీ ‘చలో సంసద్’ మార్చ్.. పోలీసులు లాఠీచార్జ్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ జనతా పార్టీ (CJP) చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్‌పై పోలీసులు విరుచుకుపడ్డారు. జంతర్‌మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు లాఠీలతో ఆందోళనకారులను చెదరగొట్టారు.
మరోవైపు జంతర్‌మంతర్ పరిసరాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. భద్రతా కారణాలతో ఇంటర్నెట్ సిగ్నల్ నిలిపివేసినట్లు సమాచారం. ఫోన్ ఇంటర్నెట్ డేటా సేవలకు అంతరాయం ఏర్పడింది. మెట్రో స్టేషన్ల వద్ద భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. చలో పార్లమెంట్ కార్యక్రమం నేపథ్యంలో ఐదు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
సిజెపి ప్రధాన ప్రతినిధి అరెస్ట్
కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి ) ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లారు.
పార్లమెంట్ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహిస్తాం : గీతాంజలి అంగ్మో
న్యూఢిల్లీ : పార్లమెంట్ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించడంపై దృష్టి పెట్టామని పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో పేర్కొన్నారు. నేడు మూడు అంశాలు చాలా కీలకమైనవని అన్నారు. మొదటిది, పార్లమెంట్ మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించడంపై దృష్టిపెట్టామని అన్నారు. దేశానికి అత్యంత అవసరమైన విద్యపై అంశంపై దృష్టిసారించాలని, అలాగే అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
సిజెపితో చర్చలకు దిగివచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి)తో చర్చల కోసం కేంద్రం దిగివచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరపున న్యూఢిల్లీ డిసిపి సచిన్ శర్మ సిజెపి బృందంతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. అయితే సిజెపి బృందం ఆయనతో చర్చలకు నిరాకరించింది. జిల్లా మెజిస్ట్రేట్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, సహాయ మంత్రితో చర్చలు జరపాలని సచిన్ శర్మ ప్రతిపాదించారు. అయితే ఆ ప్రతిపాదనను సిజెపి తిరస్కరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తాము ప్రధాని లేదా కేబినెట్ మంత్రితోనే చర్చలు జరుపుతామని పేర్కొన్నాయి. ఇందుకోసం మంత్రుల జాబితాను డిసిపికి సమర్పించినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. కాక్రోచ్ పార్టీ పిలుపుమేరకు ‘చలో సంసద్’ మార్చ్ కోసం భారీగా యువ జంతర్ మంతర్‌కు చేరుకున్నారు.

న్యూఢిల్లీ : పార్లమెంటుకు వెళ్లే రహదారిపై భారీగా పోలీసులు మోహరించారు. సిజెపి పిలుపు మేరకు వేలాదిగా చేరుకున్న నిరసనకారులు పార్లమెంటుకు వెళ్లేందుకు ర్యాలీగా బయలుదేరారు. సంసద్ మార్గ్ వైపు నుండి పార్లమెంట్ వైపుగా వెళ్తున్న నిరసనకారులను భద్రతా దళాలు అడ్డుకున్నాయి. సంసద్ మార్గ్ పోలీస్ స్టేషన్ వద్ద భద్రతా దళాలు వారిని నిలిపివేశాయి. నిరసనకారులను అదుపు చేయడానికి భద్రతా దళాలు లాఠీలను ఉపయోగించాయి. గాయపడిన కొందరు నిరసనకారులకు అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించారు.








కామెంట్‌లు (0)