ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకూ పొడిగించింది. ఈ మేరకు నూతన షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎస్‌ఐఆర్ గడువును పెంచాలని సిపిఎం, సిపిఐ, వైసిపి, ఇతర పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి సోమవారం లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ లెవల్ అధికారులు ఇంటింటి సర్వే ఈ నెల 24 వరకూ నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ/పునర్‌వ్యవస్థీకరణ ఈ నెల 24లోపు పూర్తి చేయాల్సి ఉంది. ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ తేదీని ఈ నెల 31గా మార్పు చేశారు. క్లైములు, అభ్యంతరాల స్వీకరణ ఈ నెల 31 నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. క్లైములు, అభ్యంతరాల పరిష్కారాన్ని వచ్చే నెల 31వ తేదీ నుంచి సెప్టెంబరు 28వ తేదీ వరకూ చేపట్టను న్నారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబరు 3న ప్రచురించనున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అన్ని ఎన్నికల అధికారులకు తెలియజేయాలని, సవరించిన షెడ్యూల్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలని, రాజకీయ పార్టీలకు కూడా లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది.
సిపిఎం రాష్ట్ర కమిటీ హర్షం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ గడువు పొడిగించడం హర్షణీయమని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ గడువును జులై 24 వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర కమిటీ హర్షం వ్యక్తం చేస్తోందని తెలిపారు. ఓటర్లకు తగిన అవగాహన లేకపోవడం, అవసరమైన పత్రాలు సమర్పించడానికి తగిన సమయం కావాలని, గడువు పొడిగించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ గతంలోనే ఎన్నికల సంఘాన్ని కోరిందని తెలిపారు. అందుకనుగుణంగా గడువు పొడిగించడం వలన ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించడానికి మరింత వీలు కలుగుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ లక్షల ఫారాలు తిరిగి రావాల్సి ఉన్నందున అవసరమైతే మరికొంతకాలం గడువు పొడిగించాలని కోరారు. ఎన్నికల సంఘం ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు గురికాకుండా ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా, పారదర్శకంగా, వివక్ష లేకుండా ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహించాలని శ్రీనివాసరావు కోరారు. సాంకేతిక కారణాలతో ఓటు హక్కును తిరస్కరించకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.








కామెంట్‌లు (0)