మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

2 రోజుల క్రితం

road acident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 07:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పల్నాడు,విశాఖ : విశాఖ జిల్లా ఆనందపురం సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఇనుమెళ్ల గ్రామానికి చెందిన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ శుభకార్యానికి కారులో వెళ్తుండగా, ముందు వెళ్తున్న లారీని కారు బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి చంద్రశేఖర్ (చంద్ర) తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను వెంటనే విశాఖపట్నంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చంద్ర నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆసుపత్రిలో మేనేజర్ గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు హుటాహుటిన విశాఖపట్నానికి బయలుదేరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్‌ను పరామర్శించి, మృతుల కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ జీవి ఆంజనేయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వారు, క్షతగాత్రుడు చంద్రశేఖర్‌ కు అత్యుత్తమ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఫోన్‌లో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబుతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఆసుపత్రికి చేరుకుని చంద్ర ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో సమీక్షిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్