ఆదివారం, 02 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Rains - వర్షాల పై భారత వాతావరణ శాఖ బులిటెన్

20 గంటల క్రితం

Rain havoc in Kerala – Three dead in landslides.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 11:28 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దేశంలో నైరుతి రుతుపవనాల కాలంలో ఆగస్టు నుంచి సెప్టెంబర్‌ వరకు ఉండే ద్వితీయార్ధంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం నెలవారీ అంచనాలను విడుదల చేసింది. వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్‌పిఎ) లో 94 శాతం కంటే తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఎల్‌పిఎ అనేది ఒక నిర్దిష్ట ప్రాంతంలో నెల లేదా రుతువు వంటి నిర్ణీత కాలంలో నమోదైన వర్షపాతం సగటును సూచిస్తుంది. ఈ సగటును సాధారణంగా 30 నుండి 50 ఏళ్ల వంటి సుదీర్ఘ కాల వ్యవధి ఆధారంగా లెక్కిస్తారు. 1971 నుండి 2020 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు దేశవ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతం దీర్ఘకాలిక సగటు 422.8 మిల్లీమీటర్లు. ఆగస్టు–సెప్టెంబర్ కాలంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మెటియోరాలజీ డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్ర స్పష్టం చేశారు. అయితే, దక్షిణ భారతదేశం, మధ్య భారతదేశం, వాయువ్య భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలు, తూర్పు, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణ లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. జూన్, జూలై మధ్య కాలంలో 13 శాతం వర్షపాతం లోటు నమోదయ్యింది. జూన్‌ నెలాఖరు నాటికి ఈ లోటు 35.4 శాతంగా ఉంది. జూలైలో కురిసిన మంచి వర్షాల కారణంగా వర్షపాతం లోటు తగ్గిందని అని డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్ర చెప్పారు.


ఈ మేరకు ఈరోజు భారత వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం .... ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు, కాకినాడ, కోనసీమ, దక్షిణ కోస్తాలో ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలో తిరుపతి, చిత్తూరు, కడప, నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా, మిగిలిన ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుంది. అదే సమయంలో విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది. రుతుపవనాల సీజన్‌లో రెండో సగం అంటే ఆగస్టు, సెప్టెంబరు నెలలు కలిపి చూస్తే ఎపి లో కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్‌, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాలు, శ్రీకాకుళం, విజయనగరంలో తక్కువ ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనావేసింది. నైరుతి సీజన్‌లో మొదటి రెండు నెలల్లో రాష్ట్రంలో 52 శాతం లోటు వర్షపాతం నమోదుతో తీవ్ర దుర్భిక్షం నెలకొంది.






ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్