విజయవాడ : విజయవాడలోని మహిళా కోర్టును వైసిపి మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఆశ్రయించింది. వరకట్న వేధింపులు, హత్యాయత్నం కేసులో .... తమను అరెస్ట్ చేయొద్దంటూ జోగి కుటుంబ సభ్యులు పిటిషన్లు దాఖలు చేశారు. ఇబ్రహీంపట్నం పోలీసులకు కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు విచారణను ఆగస్టు 4 కు వాయిదా వేసింది.
మేఘన పై శారీరక, మానసిక వేధింపులు ...
అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా వేధించడమే కాకుండా, పలుమార్లు తనను హత్య చేసేందుకు ప్రయత్నించారంటూ ఆయన కోడలు మేఘన పోలీసులను ఆశ్రయించారు. 2025 మే 28న సూర్యాపేటలో జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌తో మేఘన వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మేఘన తల్లిదండ్రులు సుమారు రూ. 5 కోట్ల ఖర్చుతో వైభవంగా వివాహం జరిపించి, 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి, ఆడపడుచుకు రూ.9 లక్షల కట్నంతో పాటు అనేక విలువైన కానుకలను అందించారు. అయితే, పెళ్లయిన నాటి నుంచే అత్తమామల వేధింపులు మొదలయ్యాయని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చినవి చాలేవంటూ మరో రూ. 5 కోట్లు అదనపు కట్నంతో పాటు, పాడుగూడెంలో ఒక ఇల్లు, అత్త ఆడపడుచులకు వజ్రాభరణాలు తెచ్చి ఇవ్వాలని ఒత్తిడి చేశారని పేర్కొన్నారు. అంతేకాకుండా, మేఘన పేరిట ఉన్న ఆస్తులను రాజీవ్ పేరిట బదిలీ చేయాలని తీవ్రంగా వేధించారని తెలిపారు.
హత్యా ప్రయత్నాలు ....
తమ ఆశ నెరవేరకపోవడంతో తనను వదిలించుకునేందుకు అనేకసార్లు హత్యాయత్నాలు చేశారని మేఘన ఆరోపించారు. ఒకరోజు ఇంటి టెర్రస్ పైనుంచి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, స్వామి అనే వ్యక్తి కలిసి తనను కిందకు తోసేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. మరో సందర్భంలో మేడకు చున్నీ బిగించి, ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపాలని చూశారని వివరించారు. పర్యటన నిమిత్తం గోవాకు వెళ్లిన సమయంలో కూడా ఒకసారి లోయలోకి తోసేయడానికి ప్రయత్నించారని మరోసారి ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారని తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లోని నార్సింగిలో ఉన్న విల్లాకు తీసుకెళ్లి అక్కడ కూడా భర్త రాజీవ్, మామ జోగి రమేష్, మరికొందరు బంధువులు కలిసి తనను కొట్టి, దిండుతో ముఖాన్ని మూసి చంపేందుకు ప్రయత్నించారని మేఘన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అర్ధరాత్రి వేళ ... భయంతో కాళ్లపై పడి వేడుకున్న మేఘన ...
ఇటీవల 2026 ఏప్రిల్ 13న అర్ధరాత్రి తన భర్త, అత్త, మామ, ఆడపడుచు, మరిది అందరూ ఒక్కటై తనపై దాడి చేశారని మేఘన తెలిపారు. మామ జోగి రమేష్ తన ముఖంపై దిండును బలంగా నొక్కిపెట్టగా, భర్త రాజీవ్ మెడకు చున్నీ బిగించి ప్రాణాలు తీసేందుకు యత్నించారని ఆవేదన చెందారు. భయంతో విలవిలలాడుతూ వారి కాళ్లపై పడి, వారు చెప్పినట్లే వింటానని వేడుకోవడంతోనే తనను ప్రాణాలతో వదిలిపెట్టారని పేర్కొన్నారు. తన భర్తకు ఉన్న శారీరక సమస్యను దాచిపెట్టి పెళ్లి చేశారని, ఇంట్లో తీవ్రంగా బంధించి రెండు రోజుల పాటు భోజనం కూడా పెట్టకుండా మానసికంగా నరకం చూపించారని మేఘన వాపోయారు. ఈ విషయాలు బయటకు చెబితే తల్లిదండ్రులకు తన శవమే కనిపిస్తుందని బెదిరించారని పోలీసుల ఎదుట ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.








కామెంట్‌లు (0)