డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో పిజి వైద్య విద్యార్థుల విధులు, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో అమలులో ఉన్న నిబంధనలను కచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డిఎంఇ) విష్ణువర్ధన్ ఆదేశించారు. పిజి వైద్య విద్యార్థులతో వరుసగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించరాదని, వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించకూడదని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి పిజి వైద్యుడికి వారానికి ఒకరోజు పూర్తి సెలవు ఇవ్వాలని, రాత్రి విధులు నిర్వహించిన మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఈ వివరాలను డ్యూటీ రోస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు. డ్యూటీ రోస్టర్లను రూపొందించేటప్పుడు పిజి వైద్యులకు రోజుకు 7 నుంచి 8 గంటల నిద్రకు అవకాశం ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. సాధారణ విధుల్లో కనీసం 30 నిమిషాల భోజన విరామం, రాత్రి విధుల్లో కనీసం 30 నిమిషాల డిన్నర్ బ్రేక్ ఇవ్వాలని, ఈ విరామాలను డ్యూటీ గంటల్లో కలపరాదని ఆదేశించారు. ప్రతి పిజి విద్యార్థికి ఏడాదికి 20 రోజుల చెల్లింపు క్యాజువల్ లీవ్, 5 రోజుల అకడమిక్ లీవ్, 52 వారాంతపు సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. వారాంతపు సెలవులను ఇతర సెలవులతో సర్దుబాటు చేయరాదని స్పష్టం చేశారు. వీరికి కౌన్సెలింగ్, సమయ నిర్వహణ, ఒత్తిడి నిర్వహణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ లేదా అంతకంటే పైస్థాయి అధికారిని పిజి రిజిస్ట్రార్‌గా నియమించాలని సూచించారు. డ్యూటీ రోస్టర్లను హెచ్‌ఒడి, పిజి రిజిస్ట్రార్, ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ రెసిడెంట్ల సమన్వయంతో రూపొందించాలన్నారు. ప్రతి కళాశాలలో నోడల్ అధికారిని నియమించి, నెలవారీ అమలు నివేదికను తదుపరి నెల 10వ తేదీలోపు డిఎంఇ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. ప్రతినెలా సమీక్షా సమావేశం నిర్వహించాలన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
సమీక్షా సమావేశాలు నిర్వహించకపోయినా, అమలు నివేదికలు సమర్పించకపోయినా సంబంధిత ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్లు, హెచ్‌ఒడిలపై తగిన చర్యలు తీసుకుంటామని డిఎంఇ విష్ణువర్ధన్ హెచ్చరించారు. జూనియర్ డాక్టర్ల విధుల ప్రదేశాల్లో నెలలోగా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. వాష్ రూమ్‌లలోనూ నిరంతర నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను సిఎస్‌ఆర్, హెచ్‌డిఎస్, సిడిఎస్ నుంచి సమకూర్చుకోవచ్చని తెలిపారు. జూనియర్ డాక్టర్ల సంఘం నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం పిజి వైద్య విద్యార్థుల విధులు, సెలవులు, సంక్షేమానికి సంబంధించి ఈ మార్గదర్శకాలను జారీ చేసినట్లు వెల్లడించారు.








కామెంట్‌లు (0)