మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ముగిసిన SIR - ఎపిలో 44.71 లక్షల ఓట్ల తొలగింపు ..!

25 జులై, 2026

SIR Exercise Concluded – 44.71 Lakh Votes Deleted in AP..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 12:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. నిన్న రాత్రి పన్నెండు గంటలతో ఈ ప్రక్రియ ముగిసింది. ఈ సర్వే గడువు ముగిసే సమయానికి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44.71 లక్షల ఓట్లకు సంబంధించిన సమగ్ర వివరాలు నమోదు కాకపోవడం గమనార్హం. క్షేత్రస్థాయి పరిశీలనలో సమాచారం లభించకపోవడంతో ఈ ఓట్లను ఎన్నికల సంఘం ‘అన్‌కలెక్టబుల్’ (సేకరించలేనివి) వర్గంలో చేర్చింది. దీని ప్రభావంతో ఈ నెల 30న ఈసీ అధికారికంగా విడుదల చేయనున్న ప్రాథమిక ఓటర్ల ముసాయిదా (డ్రాఫ్ట్) జాబితాలో ఈ 44.71 లక్షల ఓట్లు కనిపించవు. సరైన ఆధారాలు లేకపోవడం, చిరునామాల మార్పు లేదా ఓటర్ల గైర్హాజరీ వంటి కారణాల వల్ల ఈ ఓట్లు తొలగింపునకు గురయ్యాయని అధికారులు భావిస్తున్నారు.


క్లైమ్స్, అభ్యంతరాలకు అవకాశం.. అక్టోబర్ 3న తుది జాబితా ...

ముసాయిదా జాబితాలో పేర్లు లేని ఓటర్లు కలవరపడాల్సిన అవసరం లేదని, తమ ఓట్లను సరిచేసుకునేందుకు సమయం ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ నెల 30 నుండి ఆగస్టు 30 వరకు నెల రోజుల పాటు ఈసీకి అభ్యంతరాలు, ఫిర్యాదులు తెలిపేందుకు అవకాశం కల్పించారు. తమ ఓటు అనుమానాస్పదంగా తొలగించబడిందని భావించేవారు లేదా మార్పులు చేయాలనుకునేవారు ఈ వ్యవధిలో తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. అందిన దరఖాస్తులపై ఎన్నికల అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, అన్ని సరిచూసుకున్న తర్వాత అక్టోబర్ 3 న ఓటర్ల తుది (ఫైనల్) జాబితాను విడుదల చేయనున్నారు.


అత్యధికంగా నెల్లూరు జిల్లాలోనే...

అత్యధికంగా నెల్లూరు జిల్లాలోనే ఓట్లు తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 2,90,579, తిరుపతి 2,87,759, కడప 2,44,879, విశాఖపట్నం 2,39,146, గుంటూరు 2,37,789 ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఉన్నాయి. తొలగించాల్సిన జాబితాలో ఉన్న 44,71,523 ఓట్లలో 13,00,152 (29.07%) ఈ 5 జిల్లాల్లోనే ఉన్నాయి. ఇవి కాకుండా మరో 18 జిల్లాల్లో లక్షకు పైగానే ఓట్లు తొలగించాల్సిన జాబితాలో ఉన్నాయని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్