శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

యానాం గోదావరిలో వేలాది చేప పిల్లలు మృత్యువాత ..!

1 గంట క్రితం

Thousands of fishlings perish in the Yanam Godavari..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 12:39 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

యానాం : యానాం గౌతమి గోదావరిలో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. భారీ సంఖ్యలో కానాగంత చేప పిల్లలు మృతిచెంది గోదావరి ఒడ్డునకు, నీటిపై తేలుతూ కనిపించడం కలవరపెడుతోంది. ముఖ్యంగా యానాం–ఎదుర్లంక వంతెన పరిసరాల్లో ఈ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తుండటంతో స్థానికులు, పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇటీవలే ఇదే ప్రాంతంలో మత్స్యకారుల వలలకు టన్నుల కొద్దీ కానాగంత చేపలు చిక్కాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అదే జాతికి చెందిన చేప పిల్లలు పెద్ద ఎత్తున మృతి చెందడం అనేక సందేహాలకు తావిస్తోంది. నీటి కాలుష్యమా ? నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గడమా ? లేక మరేదైనా సహజ కారణమా ? అనే చర్చ సాగుతోంది. చేపల మరణాల వెనుక అసలు కారణాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు మత్స్యశాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వెంటనే నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.


లవణీయతలో ఆకస్మిక మార్పే కారణమా ?

మత్స్యకారుల కథనం ప్రకారం .... కానాగంత చేపలు సాధారణంగా సముద్రం, గోదావరి ముఖద్వారం ప్రాంతాల నుంచి గుంపులుగా గౌతమి గోదావరిలోకి ప్రవేశిస్తాయి. ఇవి ప్రధానంగా ఉప్పునీరు లేదా ఉప్పు–తీపి నీటి మిశ్రమమైన బ్రాకిష్ వాటర్‌లో జీవిస్తాయి.


ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి భారీగా వరద నీటిని విడుదల చేయడంతో గోదావరిలో తీపి నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. దీంతో నీటిలో లవణీయత గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఆకస్మిక మార్పును తట్టుకోలేక కానాగంత చేప పిల్లలు మృతి చెంది ఉండవచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు.


నిపుణులు ఏమంటున్నారు ?

కాకినాడ పీఆర్ ప్రభుత్వ కళాశాల జువాలజీ విభాగాధిపతి డాక్టర్ బొల్లోజు అహ్మద్ అలీబాబా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సముద్రం నుంచి గౌతమి గోదావరిలోని ఉప్పునీటి ప్రాంతాలకు వలస వచ్చే కానాగంత చేపలు, లవణీయత ఒక్కసారిగా తగ్గితే ఆ పరిస్థితిని తట్టుకోలేక మృతి చెందే అవకాశం ఉందని ఆయన వివరించారు. యానాం మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దడాల గొంతెయ్య కూడా గతేడాది ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని గుర్తు చేశారు. అప్పట్లో కూడా గోదావరి నుంచి భారీగా తీపి నీరు సముద్రంలోకి చేరడంతో కానాగంత చేపలు ప్రభావితమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేయడం వల్ల నీటిలో లవణీయత తగ్గి, చేపల మరణాలకు అదే ప్రధాన కారణమై ఉండవచ్చని చెప్పారు. అయితే చేపల మరణాలకు అసలు కారణం ఏమిటన్నది నీటి నమూనాల శాస్త్రీయ పరీక్షల అనంతరం వచ్చే నివేదికతోనే స్పష్టత వస్తుందని అధికారులు వెల్లడించారు. అప్పటి వరకు లవణీయత మార్పే ప్రధాన కారణంగా భావిస్తున్నప్పటికీ, కాలుష్యం లేదా ఇతర పర్యావరణ అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్