పెల్లెట్ గన్స్ వాడారన్న బాధితుల ఆరోపణలు.. మేకులున్న లాఠీల వీడియోలు నిజమేనన్న ఆల్ట్ న్యూస్
న్యూఢిల్లీ : జూలై 20న సిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఛలో పార్లమెంట్' కార్యక్రమంలో విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు జరిపిన దాడులపై వివాదం మరింత ముదురుతోంది. ఈ ఘటనకు సంబంధించి రోజుకో కొత్త ఆధారం వెలుగులోకి వస్తుండగా .... పోలీసులు మేకులు అమర్చిన లాఠీలతో విద్యార్థులపై దాడి చేశారనే ఆరోపణలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరలయ్యాయి.
ఆ వీడియోలు నిజమే : స్వతంత్ర ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ ఆల్ట్ న్యూస్
ఈ వీడియోలు నకిలీవని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. అనంతరం పిఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా స్పందిస్తూ .... వైరల్ అవుతున్న వీడియోలు ఫేక్ అని, ఢిల్లీ పోలీసులు మేకులున్న లాఠీలను ఉపయోగించలేదని పేర్కొంది. అయితే స్వతంత్ర ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థ ఆల్ట్ న్యూస్ నిర్వహించిన పరిశీలనలో .... ఆ వీడియోలు నిజమైనవేనని నిర్థారణ అయినట్లు తన కథనంలో స్పష్టం చేసింది. దీంతో ఈ అంశంపై మరింత చర్చ మొదలైంది.

పెల్లెట్ గన్స్‌తో దాడి చేశారు : మీడియాతో బాధిత యువకులు
మరోవైపు, 'ఛలో పార్లమెంట్'లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ గన్స్‌ను కూడా ఉపయోగించారన్న ఆరోపణలు బయటకు వస్తున్నాయి. గాయపడిన పలువురు విద్యార్థులు మీడియా ఎదుట తమ అనుభవాలను వెల్లడించారు. ఢిల్లీకి చెందిన 25 ఏండ్ల యువకుడు మీడియాతో మాట్లాడుతూ .... పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొంటున్న సమయంలో పోలీసులు తనపై పెల్లెట్ గన్స్‌తో కాల్పులు జరిపారని తెలిపాడు. తనకు తగిలిన గాయాలను పరిశీలించిన సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యుల నివేదికలు కూడా అదే విషయాన్ని సూచిస్తున్నాయని వివరించాడు. మరో 19 ఏండ్ల విద్యార్థి మాట్లాడుతూ .... పెల్లెట్ గన్స్ దాడి కారణంగా తన ఒక కన్ను చూపు మందగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదే ఘటనలో మరో యువకుడు కూడా గాయపడినట్లు ప్రముఖ మీడియా వెల్లడించింది. తమతో పాటు మరికొందరు విద్యార్థులు కూడా ఇలాంటి దాడులకు గురయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులపై పోలీసులు అనుసరించిన బలప్రయోగం, అందులో పెల్లెట్ గన్స్ వినియోగం జరిగిందా ? లేదా అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్లు ఈ పరిణామాల నేపథ్యంలో మరింత బలపడుతున్నాయి.







కామెంట్‌లు (0)