శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నీటి సరఫరా నిలిపివేత

22 జూన్, 2026

Cockroach Janta Party
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 01:04 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఆందోళనకారుల ఆధార్ వివరాలు సేకరణ

  • పోలీసుల తీరు సరికాదు : సిజెపి

  • మూడో రోజూ కొనసాగిన నిరసనలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్-యుజి ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, అవకతవకల ఆందోళన చేస్తున్న ప్రాంతంలో పోలీసులు కుయుక్తులకు పాల్పడ్డారు. ఆందోళన చేస్తున్నవారికి ఇబ్బందులు సృష్టించేందుకు నీటి సరఫరా నిలిపేశారు. అలాగే వారి ఆధార్ కార్డు వివరాలు, చిరునామా సేకరిస్తున్నారు. విద్యార్థుల పట్ల పోలీసులు అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. మరోవైపు విద్యార్థులు, యువత చేస్తున్న ఈ ఉద్యమానికి రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి.

‘ప్రధాన్‌’ ‌రాజీనామా చేయాల్సిందే..

నీట్ ప్రశ్నాపత్రం లీక్, సిబిఎస్ఇలో అవకతవకలు వంటి విద్యా సంబంధిత వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సిజెపి) స్పష్టం చేసింది. పరీక్షలను సరిగ్గా నిర్వహించడం చేతకాని ఎన్‌‌టిఎను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద సిజెపి ఆధ్వర్యాన జరుగుతున్న ఆందోళన మూడో రోజు సోమవారం కొనసాగింది. నిరసనకారుల పట్ల అధికార యంత్రాంగం తీరుపై సిజెపి వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జంతర్ మంతర్‌లోని మరుగుదొడ్లకు వరుసగా రెండో రోజూ నీటి సరఫరా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. ఆందోళనకు వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆందోళనకారులకు నీళ్లు, అరటిపండ్లు పంపిణీ చేస్తున్న వారి ఆధార్ కార్డు వివరాలు, చిరునామాలను ఢిల్లీ పోలీసులు సేకరిస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సహాయం చేస్తున్న వారిని సైతం అనుమానాస్పదంగా చూడటం సరైంది కాదని అభిజిత్ పేర్కొన్నారు. నీట్-యుజి లీక్ వ్యవహారంలో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

జంతర్ మంతర్‌‌లో ఆందోళనకారుల కోసం స్వచ్ఛంద సంస్థలు, మద్దతుదారులు లంగర్ ఏర్పాటు చేసి ఆహారం, లస్సీ పంపిణీ చేస్తున్నారు. అనేక మంది రాత్రంతా అక్కడే బస చేస్తుండటంతో చెప్పులు, సామాన్లు, పాత్రలు అక్కడే కనిపిస్తున్నాయి. పోలీసులు అనుమతి గడువు ముగిసిందని తెలిపినా.. ప్రత్యామ్నాయ వేదిక కేటాయించే వరకు తాము నిరసన కొనసాగిస్తామని సిజెపి ప్రతినిధులు స్పష్టం చేశారు. మరోవైపు మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త జ్ఞానేశ్వర్ రఘునాథ్ థోరట్ల ఆందోళనలో పాల్గొన్నారు. ‘విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతారు.

కానీ కొందరి లాభం కోసం పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే అది లక్షలాది కుటుంబాలకు అన్యాయం చేసినట్టే’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నీట్-యుజి పేపర్ లీక్ వివాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. మరోవైపు రీ టెస్టును కూడా ఎన్‌‌టిఎ సరిగ్గా నిర్వహించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు జంతర్ మంతర్ వేదికగా కొనసాగుతున్న ఆందోళన, కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలు మరోసారి ఈ అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చాయి. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ బాధ్యతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్