న్యూఢిల్లీ : పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిరక్షణపై దాఖలైన పిల్‌పై రేపటిలోగా స్పందించాలని ఢిల్లీహైకోర్టు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలను బుధవారం ఆదేశించింది. జంతర్‌మంతర్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిన సంగతి తెలసిందే. దీంతో ఆయన ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అత్యవసర జోక్యాన్ని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ అంశం అత్యవసర స్వభావం దృష్ట్యా .. గురువారం నాటికల్లా స్పందించాలని చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.
న్యాయవాది, సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సైనీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించిందని, ఆయన ప్రాణాలను కాపాడటానికి తక్షణ చర్యలు అవసరమని పిటిషన్‌లో కోరారు. ‘‘నిరాహారదీక్ష చేపడుతున్న విద్యార్థి ఆస్పత్రిపాలైంది, నిరాహార దీక్ష కొనసాగుతుండటంతో వాంగ్‌చుక్ 8.25 కేజీల బరువు తగ్గారు’’ అని జాతీయ మీడియాలో ప్రచురితమైన వార్తా కథనాన్ని సైనీ ఆధారంగా పేర్కొంటూ.. వాంగ్‌చుక్‌కు సరైన వైద్య సహాయం అందించేలా కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు."బిఎన్‌ఎస్ 2023 సెక్షన్ 108 ప్రకారం 'ఆత్మహత్యకు ప్రేరేపించడం' అనే నేరం జరిగేందుకు ప్రభుత్వం అనుమతించకూడదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తే, అది పరోక్షంగా ఆత్మహత్యకు ప్రేరేపించినట్లవుతుంది" అని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. అతని ఆరోగ్యాన్ని కాపాడటానికి, ప్రాణాలను రక్షించడానికి, అవసరమైతే బలవంతంగానైనా సరే ప్రభుత్వం తగిన వైద్య సేవలను అందించాలని పిటిషన్‌లో కోరారు.








కామెంట్‌లు (0)