భూటాన్ : పొరుగుదేశమైన భూటాన్‌లో చోటుచేసుకున్న భారీ వరద ప్రమాదం భారత ఈశాన్య రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఇటీవల నేపాల్‌లో సంభవించిన మెరుపు వరదల ఘటన మరువకముందే.. వాయవ్య భూటాన్‌లోని గాసా జిల్లాలో ఉన్న షింటాఫు సరస్సు ఒక్కసారిగా విస్ఫోటం చెందింది. దీంతో సరస్సులోని సుమారు 7.4 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు ఒక్కసారిగా బయటకు ప్రవహించి, మోచు నదిలో వరద ఉధృతి పెరిగింది.

వరదలో కొట్టుకుపోయిన వేడినీటి బుగ్గ సౌకర్యాలు ....
గాసా జిల్లాలో మోచు నది పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ వేడినీటి బుగ్గ 'గాసాత్చాచు' వద్ద భారీ నష్టం సంభవించింది. వరద ప్రవాహానికి అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, నీటి ప్రవాహ మార్గాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన భూటాన్ అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం తప్పింది.
భారత సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తత ....
భూటాన్‌లో పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు దిగువ ప్రాంతాల్లో ఉన్న భారత ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించారు. వరద నీరు శ్రీగాంగ్ ప్రాంతాన్ని దాటి భారత సరిహద్దుల వైపు వేగంగా కదులుతుండటంతో పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.
పశ్చిమ బెంగాల్‌లో .... సంకోష్, మోచు నదుల పరీవాహక ప్రాంతాలతో పాటు డార్జిలింగ్ కొండ ప్రాంతాలు, అలీపుర్‌దువార్, జల్‌పాయిగురి, కూచ్‌బెహార్ జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేసి, ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
అస్సాంలో .... ధుబ్రి జిల్లాతో పాటు నదీ దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.
ప్రమాదకర హిమానీనద సరస్సుల్లో ఒకటి ....
హిమాలయ ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన 17 హిమానీనద సరస్సుల్లో షింటాఫు సరస్సు కూడా ఒకటి. ఈ సరస్సు మోచు నదికి ప్రధాన నీటి వనరుగా ఉంది. గతంలో 2021లోనూ మోచు నది ప్రవాహ మార్గం మారడంతో గాసాత్చాచు వేడినీటి బుగ్గ వద్ద నిర్మించిన సదుపాయాలు దెబ్బతిన్నాయి. తాజా ఘటన నేపథ్యంలో భారత్‌లోని పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల విపత్తు నిర్వహణ బృందాలు (NDRF, SDRF) పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. వరద ప్రభావం దిగువ ప్రాంతాలపై పడకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నాయి.








కామెంట్‌లు (0)