న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ సబ్సిడీని కోట్లాది రూపాయలు తన సొంత కుటుంబం కోసం దుర్వినియోగం చేశారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఐఏఎస్ అధికారిని మోడీ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. నీట్ యూజీ పరీక్ష అవకతవకలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారిని బదిలీ చేసిన కేంద్రం .. ఆయన స్థానంలో కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్న నరేష్ పాల్ గంగ్వార్‌ను నియమించింది. ఆయన 1994 బ్యాచ్ రాజస్థాన్ కేడర్‌కి చెందినవారు. ఇప్పటికే నీట్ పరీక్షల్లో అవతవకలు సహా పలు కుంభకోణాలు ఎదుర్కొంటున్న ఈ శాఖలోకి కేంద్రప్రభుత్వం మరో అవినీతి నిందితుడిని నియమించడం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ ఉద్యానవన మండలి రైతు సంక్షేమ పథకాన్ని అడ్డుకున్నారని గంగ్వార్ తల్లి, భార్య, కుమారుడిపై ఆరోపణలు ఉన్నాయి. వీరు జైపూర్‌లోని భాసింగ్‌పురా గ్రామంలో తమ వ్యవసాయ క్షేత్రం పేరుతో గత 5 ఏళ్లలో రూ. 1.16 కోట్ల సబ్సిడీని పొందారు. పేద రైతులకు ఇవ్వాల్సిన ఈ భారీ మొత్తాన్ని ఉన్నత స్థాయి పలుకుబడిని ఉపయోగించి పొందారు. గంగ్వార్ తన 2021-22 వార్షిక అఫిడవిట్‌లో తాను పొందిన ప్రయోజనాల్లో ఒకదానిని మాత్రమే వెల్లడించి, మిగిలిన మొత్తాల వివరాలను దాచిపెట్టారు. ఈ తీవ్రమైన అవినీతి వెలుగులోకి వచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా, ఆ అధికారికి మరింత ముఖ్యమైన పదవికి పదోన్నతి కల్పించింది. నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్‌పై జాతీయ రాజధానిలోని జంతర్ మంతర్‌తో సహా పలుచోట్ల విద్యార్థి సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో, నరేష్ పాల్ కేంద్ర ఉన్నద విద్యాశాఖకు కొత్త కార్యదర్శిగా నియమితులయ్యారు.
ప్రధాని జవాబుదారీతనం ఇదేనా : జాన్ బ్రిట్టాస్
విద్యాశాఖ కార్యదర్శి నియామకంపై 'ఇదేనా ప్రధాని మోడీ జవాబుదారీతనం?' అని సిపిఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ఇదొక మహా ప్రహసనం’ అంటూ కేంద్రం తీరును ఎండగట్టారు. ‘‘పరీక్షల కుంభకోణాలు, ప్రశ్నపత్రాల లీక్‌లపై దేశం జవాబుదారీతనం కోరుతున్న సమయంలో, ప్రభుత్వం నరేష్ పాల్ గంగ్వార్‌ను కొత్త ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమించింది. ఆ ఐఏఎస్ అధికారి, తల్లి, భార్య ముగ్గురూ కలిసి వాణిజ్య పంటలను ప్రోత్సహించే (దోసకాయ సాగు) పథకం కింద ప్రభుత్వ రాయితీల రూపంలో రూ.1.16కోట్లను దోచుకున్నారు. ప్రధాని మోడీ జవాబుదారీతనాన్ని నిర్ధారించే విధానం ఇదే’’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.







కామెంట్‌లు (0)