శుక్రవారం, 24 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వచ్చే ఏడాదికి గిరిజన ప్రాంత పాఠశాలలన్నింటికీ సొంత భవనాలు : మంత్రి లోకేష్

1 గంట క్రితం

All schools in tribal areas to have their own buildings by next year: Minister Lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 24, 2026, 03:32 అపరాహ్నం | 6 నిమిషాల చదవడం

  • ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలలకు 1.10లక్షల మంది విద్యార్థులు

  • ప్రభుత్వ స్కూళ్ల ఎదుట నో అడ్మిషన్ బోర్డులు...రెండేళ్ల కష్టం ఫలించింది

  • చరిత్రలో తొలిసారి ప్రభుత్వ టెన్త్ ర్యాంకర్లతో యాడ్స్ ఇచ్చాం

  • రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కలసికట్టుగా ముందుకు సాగుదాం

  • రంపచోడవరం మెగా పేరెంట్-టీచర్ మీట్ లో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్


ప్రజాశక్తి -ప్రత్యేక ప్రతినిధి (రంపచోడవరం-అల్లూరి) : వచ్చే ఏడాది లోగా గిరిజన ప్రాంతాల్లో భవనాలు లేని ప్రభుత్వ స్కూళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేస్తాం, పాడైన బిల్డింగులను బాగు చేస్తామని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రంపచోడవరం గవర్నమెంట్ హైస్కూలులో శుక్రవారం నిర్వహించిన మెగా పేరేంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ... మనందరి రెండేళ్ల కృషి ఫలించిందన్నారు. సుమారు 1.10 లక్షల మంది విద్యార్థులు ఈ ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చేరారని, దీనికి కారణం ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులేనన్నారు. పిల్లల మంచిమార్కులే మనకు పబ్లిసిటీ అని చెప్పారు. ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల బ్రాండ్ అంబాసిడర్లుగా మారారన్నారు. చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల ముందు నో అడ్మిషన్ బోర్డులు చూస్తున్నామని, తాను తన నియోజకవర్గం మంగళగిరిలో పర్యటిస్తునప్పుడు ఒక తల్లి తన దగ్గరకి వచ్చిందని... అన్నా నా బిడ్డకి స్కూల్ లో సీట్ కావాలి అని అడిగిందని తెలిపారు. ఆ సీట్ ప్రభుత్వ పాఠశాలలో కావాలి అని అడిగింది ఆ తల్లి. నేను ఒక్క నిమిషం షాక్ అయ్యానన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో నిడమర్రు స్కూలును పైలెట్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేశానన్నారు. అది సక్సెస్ అయితే నియోజకవర్గానికి ఒక స్కూల్ కట్టాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం డిమాండ్ పెరిగిందని తెలిపారు. ఉపాధ్యాయుల కఠోర శ్రమతో ప్రభుత్వ స్కూళ్లకు పూర్వవైభవం వస్తోందని మంత్రి లోకేష్ తెలిపారు.


తల్లిదండ్రుల కలల సాకార వేదిక మెగా పిటిఎం .....

'' మన ఇంట్లో కొడుకు అయినా... కూతురు అయినా... మొదటిసారి పాఠశాలకు వెళ్లే రోజు ప్రతి తల్లిదండ్రి కళ్లలో ఆనందం ఉంటుంది... అదే సమయంలో ఒక చిన్న ఆందోళన కూడా ఉంటుంది. నా బిడ్డ బాగా చదువుకోవాలి... మంచి మనిషిగా ఎదగాలి... జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ఆశ ప్రతి తల్లిదండ్రి గుండెల్లో ఉంటుంది. ఆ ఆశను నమ్మకంగా... ఆ కలను నిజంగా మార్చే వేదికే మన మెగా పీటీఎం. ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది తల్లిదండ్రులు పాఠశాలలకు రావడం చూస్తుంటే... ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంలా అనిపించడం లేదు... ఒక కుటుంబ వేడుకలా ఉంది. నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఒక హామీ ఇచ్చాను. ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తానని మాట ఇచ్చాను. ఈరోజు ఆ హామీని నిలబెట్టుకునే ప్రయాణంలో మొదటి అడుగు పడింది. ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన ప్రతి ఉపాధ్యాయుడికి... ప్రతి తల్లిదండ్రికి... ప్రతి విద్యార్థికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. `` అని మంత్రి లోకేష్ అన్నారు.


త్యాగధనులు పుట్టిన నేల రంపచోడవరం ....

'' రంపచోడవరం వచ్చిన తరువాత కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ నేలలో వీరత్వం ఉంది...త్యాగం ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారు నడిచిన గొప్ప నేల రంపచోడవరం. గిరిజనుల ఆత్మగౌరవ పోరాటానికి సాక్ష్యం ఈ గడ్డ. రంపచోడవరం అడవుల్లో అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్ర్య జ్యోతిని వెలిగించారు. ఆ జ్యోతి దేశ భక్తిగా మారింది. ఇక్కడికి వచ్చినప్పుడు పచ్చని అడవితల్లి స్వాగతం పలికింది. గిరిజనుల ఆత్మీయత మరిచిపోలేను. మెగా పీటీఎం మొదలు పెట్టినప్పుడు నుంచి ఒక్కో ప్రాంతంలో జరుపుకుంటున్నాం. ఈ మెగా పీటీఎం గిరిజన ప్రాంతం అయిన రంపచోడవరంలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. `` అని మంత్రి లోకేష్ చెప్పారు


కనిపించే దేవుళ్లు టీచర్లు, తల్లిదండ్రులు ....

'' మనం దేవుడిని చూడకపోయినా ఉన్నాడని నమ్ముతాం. ఎందుకంటే ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడు, సేవ ఉన్నచోట దేవుడు ఉంటాడు, త్యాగం ఉన్న చోట దేవుడు ఉంటాడు. మన లైఫ్ లో అలాంటి దేవుళ్ళు ఇద్దరే ఉన్నారు. మన మొదటి దేవుళ్లు తల్లిదండ్రులు, మన జీవితానికి దారి చూపించే దేవుళ్లు ఉపాధ్యాయులు. అందుకే ప్రతి మెగా పీటీఎంలో మనం ఒక అందమైన సంప్రదాయాన్ని ప్రారంభించాం. 'తల్లికి వందనం'... ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు... మనకు జన్మనిచ్చిన తల్లికి, మన భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు కృతజ్ఞత చెప్పడం. పిల్లలూ... ఇప్పుడు మీ అందరినీ ఒక చిన్న కోరిక కోరుతున్నాను. మీ అమ్మగారి పాదాలకు నమస్కారం చేయండి. అమ్మకు నమస్కారం చేయడం అంటే... దేవుడికి నమస్కారం చేసినట్టే. అలాగే మీ ఉపాధ్యాయులను, మీ తల్లిదండ్రులను, మీ పెద్దలను ఎప్పుడూ గౌరవించండి. ఆ గౌరవమే మీ జీవితంలో గొప్ప విజయాలకు పునాది అవుతుంది. తల్లి ఆశీస్సులు ఉంటే విజయానికి అడ్డు ఉండదు. గురువు ఆశీస్సులు ఉంటే భవిష్యత్తు బాగుంటుంది. `` అని మంత్రి లోకేష్ తెలిపారు.


టీచర్ వల్లే అబ్దుల్ కలాం ఉన్నతస్థానానికి .....

'' డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు ఒక సాధారణ కుటుంబంలో పెరిగారు. తన జీవితంలో ఇద్దరు వ్యక్తులు నాకు గొప్ప బలం ఇచ్చారు... నా తల్లి... నా గురువు అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. తల్లి మంచి విలువలు నేర్పింది... గురువు పెద్ద కలలు కనడం నేర్పారు. ఒక రోజు ఆయన టీచర్ సుబ్రహ్మణ్య అయ్యర్ పక్షులు ఎలా ఎగురుతాయో పుస్తకంలో చెప్పి ఆపలేదు. పిల్లలందరినీ సముద్ర తీరానికి తీసుకెళ్లి ప్రత్యక్షంగా చూపించారు. ఆ రోజు కలాం గారి మనసులో విమానాలపై ఆసక్తి పుట్టింది. అదే ఆసక్తి ఆయనను ఏరోస్పేస్ ఇంజనీర్‌గా... క్షిపణి శాస్త్రవేత్తగా... చివరకు భారత రాష్ట్రపతిగా తీర్చిదిద్దింది. ఒక మంచి ఉపాధ్యాయుడు ఒక పాఠాన్ని మాత్రమే చెప్పడు... జీవితానికి దిశ చూపిస్తాడు. ఆ ఇద్దరూ లేకపోతే అబ్దుల్ కలాం రాష్ట్రపతి కాలేకపోయేవారు. ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక గొప్ప తల్లి... ఒక గొప్ప గురువు ఉంటారు. `` అని మంత్రి లోకేష్ వివరించారు.


నా భవిష్యత్తు మీ చేతుల్లోనే..! .....

'' నేను విద్యా శాఖ మంత్రి అయిన రెండేళ్ల తరువాత మీరంతా నాకు ఒక కిక్ మూమెంట్ ఇచ్చారు. నేను మొదటి పీటీఎం రోజు చెప్పాను టెన్త్, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు 111, 222, 333, ర్యాంక్స్ అన్నీ మావే అని ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు యాడ్స్ ఇస్తాయి. అలాంటి రిజల్ట్స్ మేము సాధిస్తాం అటువంటి యాడ్ ఇస్తాం అని. నా కోరిక మీరు తీర్చారు. ఈ ఏడాది వచ్చిన టెన్త్ అండ్ ఇంటర్ రిజల్ట్స్ లో మన పిల్లలు రికార్డులు బద్దలు కొట్టారు. ఇచ్చిన మాట ప్రకారం చరిత్ర లో మొదటి సారి టెన్త్ అండ్ ఇంటర్ లో ర్యాంక్స్ సాధించిన పిల్లల ఫొటోలతో యాడ్స్ ఇచ్చాం. అందులో ముఖ్యమంత్రి గారి ఫోటో లేదు, నా ఫోటో లేదు. ఇది నా విజయం కాదు.. ఇది ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు విజయం. మన పిల్లల ఫోటోలను పేపర్ లో , టివిలో చూసినప్పుడు నాకు నిజంగా కిక్ వచ్చింది. మీరు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తేనే నాకు సీఎం గారు మంచి మార్కులు వేస్తారు. మీరు పరీక్ష తప్పితే సీఎం గారు నాకు మైనస్ మార్కులు వేస్తారు. మీ మార్కులే... నా ప్రోగ్రెస్ రిపోర్ట్. నా ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రం మీ చేతిలో ఉంటుంది. నా భవిష్యత్తు మీ చేతిలో ఉంది. `` అని మంత్రి లోకేష్ అన్నారు.


మహిళలను అవమానిస్తే సహించేదిలేదు ....

'' విలువలతో కూడిన విద్య అవసరం. అందుకే మనం చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ గా నియమించుకున్నాం. ఆయన చెప్పిన ఒక మాట నాకు బలంగా గుర్తుండిపోయింది. తల్లికి చెప్పలేని పని ఏదీ చెయ్యొద్దు అన్నారు. వినడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ అర్ధం చేసుకుంటే అందులో చాలా పవర్ ఫుల్ మెసేజ్ ఉంది. ఆయన రాసిన విలువల పుస్తకాలు మనం విద్యార్థులకు అందిస్తున్నాం. ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. మహిళలను గౌరవించడం మన ఇంటి నుండి మొదలవ్వాలి. ఇప్పటికీ కొంత మంది మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారు. అమ్మాయిలా ఏడవొద్దు, చీర కట్టుకున్నావా, గాజులు వేసుకున్నావా అని మహిళల్ని అవమానపరుస్తూ మాట్లాడతారు. అలాంటి మాటలు ఎవరు మాట్లాడినా వద్దు అని గట్టిగా చెప్పండి. మహిళల జోలికొస్తే లోకేష్ అన్న తోలు తీస్తాడు అని వార్నింగ్ ఇవ్వండి. `` అని మంత్రి చెప్పారు.


చదువుకు దూరం కావద్దనే తల్లికి వందనం ....

'' ఏ బిడ్డా చదువుకి దూరం కాకూడదు అనేది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశయం. అందుకే ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నాం. 2025 లో 67.27 లక్షల మందికి 10,090 కోట్లు ఇచ్చాం. 2026 లో 67.47 లక్షల మందికి 10,120 కోట్లు ఇచ్చాం. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు చదువుకోవాలి ఇంకొకరు పనికి వెళ్ళాలి అనేది గత ప్రభుత్వ విధానం. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాత్రం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తున్నారు. వెంటనే మేలుకోండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అని స్వామి వివేకానంద చెప్పిన మాటలను త్రికరణశుద్ధితో పాటిస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేష‌న్ “లీప్” కోసం కృషి చేస్తున్నాం. వన్ క్లాస్ వన్ టీచర్ మన బలం. సుమారుగా 10 వేల స్కూల్స్ లో వన్ క్లాస్ వన్ టీచర్ విధానం అమలు చేస్తున్నాం. `` అని మంత్రి లోకేష్ అన్నారు.


విద్యాసంస్థల్లో నో పాలిటిక్స్ .....

'' స్కూల్ అండ్ కాలేజీల్లో నో పాలిటిక్స్. పుస్తకాల దగ్గర నుండి స్కూల్స్ వరకూ ఎక్కడ సీఎం గారి ఫోటో లేదు, నా ఫోటో లేదు. మెగా డిఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. డొక్కా సీతమ్మ పేరుతో రీజియన్ బేస్డ్ మెనూతో మధ్యాహ్నభోజన పథకం అమలు చేస్తున్నాం. త్వరలోనే రాష్ట్రం మొత్తం స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేస్తాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం. స్టూడెంట్ ఓవర్ ఆల్ డెవెలప్మెంట్ కోసం శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం. పాసివ్ లెర్నింగ్ నుండి యాక్టివ్ లెర్నింగ్ కి మార్చడానికి క్లిక్కర్ మోడల్ తీసుకొచ్చాం. FLN - అమలు చేస్తున్నాం. లెర్నింగ్ అవుట్ కమ్ ఒక్కటే టార్గెట్ గా పెట్టుకున్నాం. లీప్ యాప్ తీసుకొచ్చాం. పాఠశాలల్లో ఎంత చదువు చెప్పినా ఇంటి దగ్గరకు వచ్చిన తరువాత తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. లీప్ యాప్ లో మొత్తం వివరాలు వస్తాయి. ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం. పిల్లలకు మనం ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు...మంచి విద్య ఇవ్వాలి. పెద్ద పెద్ద భవనాలు కట్టకపోయినా పర్వాలేదు...పెద్ద కలలు కనడం నేర్పాలి. డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు...ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే...ఆస్తి ఒక తరాన్ని మాత్రమే నిలబెడుతుంది. విద్య తరతరాలను నిలబెడుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం... మన రాష్ట్ర భవిష్యత్తు కోసం... మనమందరం కలిసి ముందుకు సాగుదాం`` అని మంత్రి లోకేష్ అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్