రాంచీ : జార్ఖండ్ నియామక పరీక్షల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా అభ్యర్థులు చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్ష బుధవారానికి 19వ రోజుకి చేరుకుంది. తమ డిమాండ్లు నెరవేరేవరకు ఆందోళనను కొనసాగిస్తామని నిరసనకారులు స్పష్టం చేశారు. నియామక వ్యవస్థలో సంస్కరణలపై హేమంత్ సోరెన్ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ‘జెపిఎస్‌సి-జెఎస్‌ఎస్‌సి సంస్కరణల మంచ్ ’ నేతృత్వంలో నిరసన చేపడుతున్న విద్యార్థులు తమ ఆందోళనను విరమించుకోవడానికి నిరాకరించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జెపిఎస్‌సి), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సి) నిర్వహించే పరీక్షల్లో మరింత పారదర్శకతను పాటించాలని, పలు పరీక్షలను రద్దు చేయాలని, సిబిఐ లేదా పొరుగురాష్ట్రాలకు చెందిన మాజీ హైకోర్టు జడ్జీల బృందంతో విచారణకు ఆదేశాలివ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ మార్చ్ చేపట్టిన నిరసనకారులపై సోమవారం పోలీసులు లాఠీచార్జ్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ 'జార్ఖండ్ ఛాత్ర న్యాయ్' ఆధ్వర్యంలో విద్యార్థులు ఒక రోజు నిరాహార దీక్ష, నల్లటి బ్యాడ్జీలతో ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ‘జెపిఎస్‌సి- జెఎస్‌ఎస్‌సి సంస్కరణల మంచ్’ సైతం మంగళవారం సాయంత్రం రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుండి ఆల్బర్ట్ ఎక్కా చౌక్ వరకు మౌన ప్రదర్శన చేపట్టింది. ఈ ఆందోళన కొనసాగుతుందని, నిరసనను మరింత ఉధృతం చేసేందుకు త్వరలోనే ఒక కొత్త కార్యాచరణను ప్రకటిస్తామని ‘జెపిఎస్‌సి- జెఎస్‌ఎస్‌సి సంస్కరణల మంచ్’ ప్రకటించింది.
క్షీణిస్తున్న నిరసనకారుల ఆరోగ్యం
ఈ ఆందోళన, నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న నిరసనకారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. ఆరుగురు నిరసనకారులు నిరవధిక నిరాహార దీక్ష చేపడుతుండగా, వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వారిని రాంచీలోని సదర్ ఆసుపత్రికి తరలించారు. సుమారు 10 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (జెఎల్‌కెఎం) నేత దేవేంద్ర నాథ్ మహతో అత్యవసర వార్డులోనే చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆగస్టు 4న జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరాహార దీక్ష ప్రారంభించిన పలాముకు చెందిన మరో నిరసనకారుడు రాహుల్ క్రాంతి పరిస్థితి విషమించడంతో ఆగస్టు 7న ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
పరీక్షా విధానంలో సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : హేమంత్ సోరెన్
ప్రభుత్వానికి, నిరసన చేపడుతున్న విద్యార్థుల ప్రతినిధులకు మధ్య ఆదివారం జరిగిన ఆరో విడత చర్చలు కూడా విఫలమైన సంగతి తెలిసిందే. పరీక్షా విధానంలో సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. 14వ జెపిఎస్‌సి పరీక్షను రద్దు చేస్తామని ఆయన నిరసనకారులకు హామీ ఇచ్చారు. విద్యార్థుల ఆందోళనను బిజెపి రాజకీయం చేసేందుకు వినియోగిస్తోందని దుయ్యబట్టారు.







కామెంట్‌లు (0)