బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కేరళలో కొనసాగుతున్న వరద భీభత్సం.. విద్యాసంస్థలకు సెలవు

1 గంట క్రితం

Kerala
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 11:42 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

తిరువనంతపురం : కేరళలో వరద భీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా ఇడుక్కి, కొట్టాయం, పథనంతిట్ట, కాసరగోడ్, అలప్పుజ, వయనాడ్, కన్నూర్, కోజికోడ్, ఎర్నాకులం, త్రిస్సూర్ జిల్లాల్లోని విద్యాసంస్థలను మూసివేసినట్లు అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దక్ష‍ిణ జిల్లాలైన పథనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని, మరిన్ని సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. వృద్ధులు, మహిళలు, పిల్లలు సహా పలువురు మోకాళ్లలోతు నీళ్లలో నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలు ఇప్పటికీ వరదనీటిలోనే మునిగిఉన్నాయని అన్నారు.

అలప్పుజ, కొట్టాయం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) అంచనా వేసింది. అదే సమయంలో కొల్లం, పథనంతిట్ట, ఇడుక్కి, ఎర్నాకులం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అది పేర్కొంది. ఐఎండి ప్రకారం.. ఆగస్టు 4న తెల్లవారుజామున 3 గంటల నుండి ఆగస్టు 5 వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా కాసరగోడ్ జిల్లాలోని పనతూరులో 84 మి.మీ వర్షపాతం నమోదవ్వగా, అదే సమయంలో కన్నూర్ జిల్లాలోని చెరువంచేరిలో 61 మి.మీ వర్షం కురిసింది. తిరువనంతపురం , కొల్లాం , అలప్పుజ తీరాల వెంబడి 1.1 నుండి 1.4 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్‌సిఒఐఎస్‌) హెచ్చరించింది. గురువారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు కన్యాకుమారి తీరం వెంబడి 1.2 నుండి 1.6 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడతాయని కూడా అది అంచనా వేసింది. మత్స్యకారులు, తీరప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ (కెఎస్‌డిఎంఎ) సూచించింది. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటం, బురద ప్రవాహాలు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కొండ ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కెఎస్‌డిఎంఎ హెచ్చరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్