బుధవారం, 05 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రధాన రోడ్డుపక్కనే మురుగు కష్టాలు

55 నిమిషాల క్రితం

pollution
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 05, 2026, 12:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- తాడిపత్రి రోడ్డుకు ఆనుకుని డ్రైనేజీ దుస్థితి

- అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం నరకయాతన

ప్రజాశక్తి-బత్తలపల్లి : మండల కేంద్రమైన బత్తలపల్లిలోని తాడిపత్రి రోడ్డుకు ఆనుకుని ఉన్న అత్యంత రద్దీ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం వాహనాలు, పాదచారులు, వ్యాపార కార్యకలాపాలతో సందడిగా ఉండే ఈ ప్రాంతంలో డ్రైనేజీ మురుగు నీరు సందులో నిల్వ ఉండటంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. డ్రైనేజీపై ఏర్పాటు చేసిన సిమెంట్ స్లాబులు విరిగి, అస్తవ్యస్తంగా మారడంతో సందులోకి వెళ్లే వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడవాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు, ద్విచక్ర వాహనదారులు నిత్యం ప్రమాద భయంతోనే ఈ మార్గంలో ప్రయాణిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో చిన్న వాహనాలు కూడా సందులోకి వెళ్లడం కష్టసాధ్యంగా మారింది. వర్షం లేకపోయినా మురుగు నీరు రోజుల తరబడి నిల్వ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి ప్రజారోగ్యానికి ముప్పుగా మారాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఈ సమస్యపై స్థానిక వ్యాపారులు, కాలనీవాసులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. తక్షణమే డ్రైనేజీని శుభ్రం చేసి, విరిగిపోయిన స్లాబులను తొలగించి కొత్త స్లాబులు ఏర్పాటు చేయాలని, మురుగు నీరు నిల్వ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు పంచాయితీ అధికారులను కోరుతున్నారు. సమస్యను ఇకనైనా అధికారులు అత్యవసరంగా పరిగణించి చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్