చెన్నై : తమిళ సినీ నటుడు ధనుష్ రాజకీయాల్లోకి రాబోతున్నారనే ఊహాగానాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఆయన మహిళా అభిమానులకు దీపావళి కానుకగా అందించిన వెండి దీపాలపై కమలం గుర్తు కనిపించడం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే, ఆ ముద్రకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ధనుష్ అభిమాన సంఘం ప్రతినిధి స్పష్టం చేశారు.
చెన్నైలో ఆదివారం ధనుష్ అభిమాన సంఘం మహిళా విభాగం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 3,000 మంది మహిళలు హాజరయ్యారు. వారితో ఫొటోలు దిగిన ధనుష్.. దీపావళి కానుకగా ప్రతి ఒక్కరికీ వెండి దీపాలను బహూకరించారు. అయితే, వాటిపై బిజెపి ఎన్నికల గుర్తు అయిన కమలం ముద్ర ఉండటంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
దీపాలపై కనిపిస్తున్న కమలం గుర్తు తయారీదారుకు సంబంధించిన ముద్ర మాత్రమేనని, దానిని రాజకీయాలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని అభిమాన సంఘం ప్రతినిధి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు స్పందించడంతో వివాదం మరింత చర్చనీయాంశమైంది.
మరోవైపు, ధనుష్ ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నారనే ప్రచారం కూడా ఊపందుకుంది. ఈ పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద నమోదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇటీవల తన అభిమాన సంఘం పేరును ‘ధనుష్ నర్పణి ఇయక్కం’గా మార్చడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిర్వాహకులను నియమించడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. అయితే, ధనుష్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది.







కామెంట్‌లు (0)