న్యూఢిల్లీ : రహదారి విస్తరణ ప్రాజెక్టులో భాగంగా తమ దుకాణాలను కూల్చివేయకుండా అడ్డుకోవాలన్న ఆరుగురు ముస్లింల పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. కాశీవిశ్వనాథ్ కారిడార్‌కు అనుసంధానంగా ప్రతిపాదించిన రహదారి విస్తరణ ప్రాజెక్టులో తమ జీవనోపాధికి ఏకైక మార్గమైన దుకాణాలను కోల్పోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం దాల్‌మండి ప్రాంతంలోని అంజుమన్ ఇంతిజామియా మసీదు, మసీదు రంగిలే షా, మసీదు అలీ రజా ఖాన్, మసీదు కరీముల్లా బేగ్, మసీదు నిసారన్, మసీదు సంగమర్మర్ సహా ఆరు మసీదులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా నిరోధించాలని వారణాసిలోని ఆరుగురు ముస్లింలు పిటిషన్‌లో అభ్యర్థించారు. అభివృద్ధి కోసం మతపరమైన ప్రదేశాలను సేకరించడాన్ని ప్రార్థనా స్థలాల చట్టం అడ్డుకోదని జస్టిస్ జె.జె.మునీర్, జస్టిస్ అరుణ్ కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానిస్తూ ఆరుగురు ముస్లింల పిటిషన్‌ను గురువారం కొట్టివేసింది. ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం, 1991 ప్రకారం.. ప్రార్థనా స్థలాల మతపరమైన చిహ్నాలను పరిరక్షిస్తుందని, అయితే రహదారుల విస్తరణ లేదా మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి ప్రజా ప్రయోజనాల కోసం అటువంటి ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని ఈ చట్టం నిషేధించదని పేర్కొంది. పిటిషనర్లు మసీదుల ముతవల్లీలు లేదా సంరక్షకులు కాకుండా, కేవలం కౌలుదారులు మాత్రమే అయినందున, ఆ మతపరమైన కట్టడాలకు రక్షణ కోరేందుకు వారికి దావా వేసే అర్హత కూడా లేదని పేర్కొంది. అయితే స్వాధీన స్థలాల చట్టం ప్రకారం.. మసీదుల స్వాధీనానికి వ్యతిరేకంగా "శాశ్వత రక్షణ కవచం"గా పనిచేస్తుందని పిటిషనర్లు వాదించారు. దీంతో ఈ అంశాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. భవిష్యత్ విచారణలలో తగిన పరిహారాలను కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డుకు లేదా మసీదుల ముతవల్లీలకు ఉన్న హక్కులకు తమ పరిశీలనలు భంగం కలిగించవని ధర్మాసనం పేర్కొంది.
రహదారి విస్తరణలో దుకాణాలను కూల్చివేయకుండా అడ్డుకోవాలన్న పిటిషన్ కొట్టివేత
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 03:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)