గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హిందూ వివాహానికి ఆచారాలు తప్పనిసరి: గుజరాత్‌ హైకోర్టు

02 జులై, 2026

Registration not enough
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 11:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

గాంధీనగర్‌: హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్దేశించిన వివాహ ఆచారాలు, వేడుకలు నిర్వహించకుండా వివాహ నమోదు (రిజిస్ట్రేషన్‌) మాత్రమే చేస్తే ఆ వివాహం చెల్లుబాటు కాదని గుజరాత్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా 'సప్తపది' వంటి కీలక ఆచారాలు నిర్వహించాల్సిందేనని పేర్కొంది. భౌగోళిక, సాంస్కృతిక భేదాలు ఉన్నప్పటికీ ఈ ఆచారాలు వ్యక్తి ఆధ్యాత్మిక జీవితంలో మార్పు తీసుకొస్తాయని హిందూ సంప్రదాయం విశ్వసిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. యుకెలో నివసిస్తున్న కౌశల్‌ సోనార్‌ దాఖలు చేసిన అప్పీల్‌పై జస్టిస్‌ ఇలేష్‌ వోరా, జస్టిస్‌ ఆర్‌టి వచ్చాని సభ్యులుగా ఉన్న డివిజన్‌ బెంచ్‌ జూన్‌ 23న ఇచ్చిన ఈ తీర్పు సోమవారం వెలుగులోకి వచ్చింది. గత ఏడాది నవంబర్‌లో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వును హైకోర్టు రద్దు చేసింది. కౌశల్‌ సోనార్‌ తన పిటిషన్‌లో తాను ఇంగ్లండ్‌‌లో నివసిస్తున్నానని, ప్రతివాది అహ్మదాబాద్‌లో ఉంటున్నారని తెలిపారు. ఆమె తన తల్లిదండ్రులను కలిసి తాను చట్టబద్ధమైన భార్యనంటూ వివాహ ధ్రువీకరణ పత్రాన్ని చూపించిన తర్వాతే ఈ వివాహం గురించి తనకు తెలిసిందని పేర్కొన్నారు. తాను ఆమెను వివాహం చేసుకోలేదని, హిందూ సంప్రదాయం ప్రకారం ఎలాంటి వివాహ ఆచారాలు లేదా వేడుకలు జరగలేదని, ఆమెతో ఎప్పుడూ భార్యాభర్తలుగా కలిసి జీవించలేదని చెప్పారు. వివాహ పత్రాలపై తన సంతకాన్ని తన సమ్మతి లేకుండా మోసపూరితంగా తీసుకున్నారని కూడా ఆరోపించారు. ఆ మహిళ కూడా కుటుంబ న్యాయస్థానం ముందు తమ మధ్య ఎలాంటి వివాహ ఆచారాలు జరగలేదని, తాము ఎప్పుడూ భార్యాభర్తలుగా కలిసి జీవించలేదని అంగీకరించినప్పటికీ, అప్పీలుదారు పిటిషన్‌ను తిరస్కరించడం సరికాదని గుజరాత్‌ హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా హిందూ వివాహ చట్టంలోని సెక్షన్‌ 7ను ప్రస్తావించిన కోర్టు, హిందూ వివాహం చట్టబద్ధం కావాలంటే సంప్రదాయ ఆచారాలు, వేడుకల ప్రకారం వివాహం జరగాలని, 'సప్తపది' వంటి కీలక ఆచారాలు దానికి అంతర్భాగమని పేర్కొంది. ప్రస్తుత కేసులో అలాంటి ఆచారాలు ఏవీ జరగనందున హిందూ వివాహానికి అవసరమైన ప్రాథమిక అంశమే లోపించిందని తేల్చింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్