చెన్నై : తమిళనాడు ప్రభుత్వంలోని పబ్లిక్ (శాంతిభద్రతల) విభాగాన్ని సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ), 2005 పరిధి నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మానవ వనరుల నిర్వహణ శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి, ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించింది. ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్ 24(4) కింద ఈ మినహాయింపు ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పబ్లిక్ (శాంతిభద్రతల) విభాగం పరిధిలో మతపరమైన, కుల ఘర్షణలకు సంబంధించిన అంశాల పరిశీలన, శాంతిభద్రతల పరిస్థితులపై సమీక్ష, విచారణ కమిషన్ల నియామకం, వాటి సిఫార్సులపై తదుపరి చర్యలు వంటి అంశాలు ఉంటాయి. సిఒఎఫ్‌ఇపిఒఎస్‌ఎ, ఎన్‌ఎస్‌ఎ చట్టాల కింద నిర్బంధానికి సంబంధించిన అంశాలు, నిర్బంధితులు లేదా వారి తరఫున హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో దాఖలయ్యే హేబియస్ కార్పస్ పిటిషన్లకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు నెలవారీ శాంతిభద్రతల సమీక్షా సమావేశాలు, ప్రత్యేక శాంతిభద్రతల సమావేశాల నిర్వహణను ఈ విభాగం చేపడుతుంది. పోలీసుల కాల్పుల ఘటనలు, పోలీసు కస్టడీలో మరణాలు, పోలీసుల హింస, రిమాండ్ ఖైదీల మరణాలకు సంబంధించిన విచారణ నివేదికలను పరిశీలిస్తుంది. ఈ విభాగం పరిధిలోని అంశాలకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) నుంచి వచ్చే రిఫరెన్సులను కూడా పరిశీలిస్తుంది.
శాంతిభద్రతలు, మతపరమైన సంఘటనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నెలవారీ నివేదికలు సమర్పించడం, లోక్‌సభ, రాజ్యసభలో అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేయడం, విద్యార్థులు, వ్యవసాయ కార్మికులు, రాజకీయ పార్టీల ఆందోళనలకు సంబంధించిన అంశాలను పరిశీలించడం వంటి బాధ్యతలు కూడా ఈ విభాగానికి ఉన్నాయి. రాజకీయ కారణాలు, మతపరమైన లేదా కుల ఘర్షణలు, రాజకీయ, విద్యార్థి ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలన్న అభ్యర్థనలను పరిశీలించడం, పరువు నష్టం కలిగించే కథనాలు, వార్తలు, ప్రసంగాలపై విచారణకు అనుమతులకు సంబంధించిన అంశాలను పరిశీలించడం కూడా దీని పరిధిలో ఉన్నాయి. అయితే ఆర్‌టిఐ చట్టంలోని సెక్షన్ 24(4) కింద మినహాయింపు ఉన్నప్పటికీ, అవినీతి ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారం పూర్తిగా మినహాయింపు పొందదు. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని రాష్ట్ర సమాచార కమిషన్ అనుమతితో అందించాల్సి ఉంటుంది.







కామెంట్‌లు (0)