17 ఏళ్ల బాలికకు ప్రాణాంతక వ్యాధి.. అదే క్రీమ్‌తో తానూ అనారోగ్యానికి గురయ్యానన్న ప్రముఖ గాయకుడు
మలప్పురం (కేరళ) : అందంగా కనిపించాలనే కోరికతో సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను గుడ్డిగా నమ్ముతున్నారా ? చర్మం తెల్లగా మారుతుందని, మొటిమలు, నల్లమచ్చలు మాయమవుతాయని ప్రచారం చేసే ఫెయిర్‌నెస్ క్రీమ్‌లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారా ? అయితే కేరళలో వెలుగుచూసిన రెండు ఘటనలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తున్నాయి. అందం కోసం వాడిన ఓ క్రీమ్ ఇద్దరి ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. ఒకవైపు 17 ఏళ్ల బాలిక తీవ్ర కిడ్నీ వ్యాధికి గురికాగా, మరోవైపు ప్రముఖ మలయాళ గాయకుడు, సంగీత దర్శకుడు సలీం కొడత్థూర్ కూడా గతంలో ఇదే తరహా క్రీమ్ వాడి కిడ్నీ సమస్యలను ఎదుర్కొన్నట్లు వెల్లడించారు.
ఇన్‌స్టా ప్రకటన చూసి.. ఏడాదిపాటు వాడి !
మలప్పురం జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక మొటిమలు, నల్లమచ్చలు, చర్మంపై పిగ్మెంటేషన్ తొలగిపోతాయంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన వీడియోలను చూసి ఆకర్షితురాలైంది. అందులో ఇచ్చిన వాట్సాప్ నంబర్ ద్వారా విక్రేతలను సంప్రదించి ఫెయిర్‌నెస్ క్రీమ్ కొనుగోలు చేసింది. మొదట్లో చర్మంపై మంచి ఫలితాలు కనిపించడంతో దాదాపు ఏడాది పాటు ఆ క్రీమ్‌ను ఉపయోగించింది. పలుమార్లు కొత్త సీసాలు కూడా తెప్పించుకుంది. అయితే కొంతకాలానికి ఆమె ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. రక్తపోటు పడిపోవడం, స్పృహ కోల్పోవడం, కాళ్లు విపరీతంగా వాపు రావడంతో పాటు నడవడానికి, మెట్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు బాలిక శరీరంలో పాదరసం (మెర్క్యురీ) ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు మెంబ్రేనస్ నెఫ్రోపతీ అనే తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. క్రీమ్‌లోని పాదరసం కిడ్నీలలోని వడపోత వ్యవస్థను దెబ్బతీసినట్లు వైద్య పరిశోధనల్లో వెల్లడైంది.
అనుమతించిన దానికంటే 12,500 రెట్లు అధికం !
ఆ క్రీమ్‌పై నిర్వహించిన పరీక్షల్లో మిలియన్‌కు ఏకంగా 12,500 భాగాల (12,500 ppm) మేర పాదరసం ఉన్నట్లు తేలింది. సాధారణంగా అనుమతించదగిన పరిమితి మిలియన్‌కు ఒక భాగం కంటే తక్కువగా ఉండాలని వైద్యులు వెల్లడించారు. అంటే ఆ క్రీమ్‌లో ప్రమాదకర స్థాయిలో పాదరసం ఉన్నట్లు స్పష్టమైంది.
నాకూ ఇదే అనుభవం : గాయకుడు సలీం
ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రముఖ మలయాళ గాయకుడు, సంగీత దర్శకుడు సలీం కొడత్థూర్ తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించారు. స్నేహితుడి సలహాతో గతంలో తాను కూడా ఫెయిర్‌నెస్ క్రీమ్ ఉపయోగించినట్లు తెలిపారు. కొన్ని నెలలకే మూత్రనాళ ఇన్ఫెక్షన్, కనురెప్పలు, కాళ్ల వాపు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తన శరీరంలో ఆల్బుమిన్ అనే ప్రొటీన్ స్థాయులు తగ్గిపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే కిడ్నీలు పనిచేయడం ఆగిపోవచ్చని వైద్యులు హెచ్చరించినట్లు వెల్లడించారు. ఆసుపత్రిలో చేరి పరీక్షలు చేయించుకోగా బయాప్సీలో మెంబ్రేనస్ నెఫ్రోపతీ ఉన్నట్లు నిర్ధారణ అయిందని, కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్నట్లు వివరించారు.
పాక్ నుంచి అక్రమంగా వస్తున్నాయా ?
ఈ ఘటనలపై కేరళ ఆరోగ్య మంత్రి మురళీధరన్ స్పందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఫేస్‌క్రీమ్‌లు, ప్రొటీన్ పౌడర్లను తనిఖీ చేయనున్నట్లు ప్రకటించారు. సంబంధిత ఉత్పత్తులు పాకిస్థాన్ నుంచి వస్తున్నాయని, మంగళూరు–కాసర్‌గోడ్ ప్రాంతాల్లో వీటి వినియోగం ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు.
మరోవైపు, క్రీమ్ వాడిన తర్వాత ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని సంస్థకు ఫిర్యాదు చేసినా సరైన స్పందన రాలేదని బాలిక కుటుంబం ఆరోపించింది. సదరు సంస్థపై వినియోగదారుల కోర్టులో న్యాయపోరాటం చేయాలని నిర్ణయించింది. విచారణ, న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి పేరు వెల్లడించలేదు.
అందం కంటే ఆరోగ్యమే ముఖ్యం !
చర్మం తెల్లగా మారుతుందని, కొద్ది రోజుల్లోనే మచ్చలు తొలగిపోతాయని సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో విక్రేతల వివరాలు, ఉత్పత్తి నాణ్యత, అందులోని రసాయనాల గురించి తెలుసుకోకుండా సౌందర్య సాధనాలు కొనుగోలు చేయడం ప్రమాదకరమని సూచిస్తున్నారు. చర్మ సమస్యలు ఉంటే సొంత వైద్యం చేసుకోకుండా నిపుణులైన చర్మవ్యాధి వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
రూపం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దు.. సోషల్ మీడియా ప్రకటనల మెరుపుల వెనుక దాగి ఉన్న ప్రమాదాన్ని గుర్తించండి !








కామెంట్‌లు (0)