మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పేదల రేషన్‌పై సంపన్నుల కన్ను.. దేశవ్యాప్త సర్వేలో వెల్లడి

6 గంటల క్రితం

The wealthy have their eyes on rations meant for the poor revealed in a nationwide survey
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 24, 2026, 01:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • దేశవ్యాప్తంగా 2.71 కోట్ల అనర్హ రేషన్ కార్డులు !

  • పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా అనర్హులు.. పశ్చిమ బెంగాల్‌లో 39.5 శాతం కార్డులు అనర్హమైనవిగా గుర్తింపు


న్యూఢిల్లీ : నిరుపేదలకు ఆహార భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత రేషన్ పథకంలో భారీగా అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ విభాగం (డీఎఫ్‌పీడీ) నిర్వహించిన తాజా సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉన్న 20.51 కోట్ల ఆహార భద్రతా కార్డుల్లో సుమారు 2.71 కోట్ల కార్డులు (13.2 శాతం) అనర్హుల చేతుల్లో ఉన్నట్లు సర్వే గుర్తించింది. సొంత కార్లు, ఏసీలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న కుటుంబాలు సైతం ఉచిత రేషన్ పొందుతున్నట్లు తేలింది.


దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 51,303 కుటుంబాలు, 4,939 చౌకధరల దుకాణాలు, 245 గోదాముల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఈ నేపథ్యంలో అనర్హుల రేషన్ కార్డులను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.


పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా అనర్హులు

సర్వే గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 12.5 శాతం రేషన్ కార్డులు అనర్హమైనవిగా గుర్తించగా, పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 15.6 శాతంగా నమోదైంది. అత్యంత నిరుపేదలకు నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు అందించే అంత్యోదయ అన్నయోజన (ఏఏవై) కార్డుల్లో 12.2 శాతం, ప్రాధాన్యతా కుటుంబాల (పీహెచ్‌హెచ్) కార్డుల్లో 13.5 శాతం అనర్హమైనవిగా తేలాయి. మరోవైపు రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ దాదాపు పూర్తయింది. దేశవ్యాప్తంగా 20.27 కోట్ల కార్డులకు (98.8 శాతం) ఆధార్ అనుసంధానం చేయగా, 71.52 కోట్ల మంది లబ్ధిదారులకు (91 శాతం) ఈ-కేవైసీ పూర్తయింది.


పలు రాష్ట్రాల్లో 20 శాతానికి పైగా అనర్హులు

రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా 39.5 శాతం రేషన్ కార్డులు అనర్హమైనవిగా గుర్తించారు. త్రిపురలో 39.2 శాతం, తమిళనాడులో 38.7 శాతం, మేఘాలయలో 28.5 శాతం, ఒడిశాలో 22.9 శాతం, సిక్కింలో 21.9 శాతం, పంజాబ్‌లో 20.6 శాతం, మహారాష్ట్రలో 20.3 శాతం కార్డులు అనర్హమైనవిగా సర్వే వెల్లడించింది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో 0.3 శాతం, మధ్యప్రదేశ్‌లో 0.5 శాతం మాత్రమే అనర్హులుగా గుర్తించినట్లు నివేదిక పేర్కొంది.


తెలుగు రాష్ట్రాల వివరాలు వెల్లడి కాలేదు

కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన నివేదికలో కొన్ని రాష్ట్రాల గణాంకాలను మాత్రమే వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయలేదు. ఈ సర్వే ఆధారంగా రేషన్ కార్డుల ప్రక్షాళన చేపడితే అనర్హుల పేర్లను తొలగించి, నిజమైన అర్హులకు పథకం ప్రయోజనాలు అందించేందుకు అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్