గుంటూరు : గుంటూరు నగర మేయర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్డీఏ కూటమి (టిడిపి-జనసేన-బిజెపి) మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోవెలమూడి లక్ష్మీ అపర్ణకు మద్దతుగా ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు ప్రచార బరిలోకి దిగారు. ఓటర్లను అభ్యర్థిస్తూ ఆయన ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
ఈ సందేశంలో జగపతి బాబు మాట్లాడుతూ.. " ప్రజలు చాలా తెలివైనవారు. సాధారణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించినందుకు గుంటూరు ప్రజలకు ధన్యవాదాలు. ఇప్పుడు నవంబర్ 1 న జరగనున్న మేయర్ ఎన్నికల్లోనూ, మా చెల్లి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను అదే విధంగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను " అని అన్నారు. " నా చెల్లికి మంచి మనసు ఉంది, సమర్థురాలు. తప్పకుండా గుంటూరుకు మంచి చేస్తుంది. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి ఆమెను గెలిపించండి. ఆమెతో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులందరినీ కూడా భారీ మెజారిటీతో గెలిపించండి " అని జగపతి బాబు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కూటమి మేయర్ అభ్యర్థిగా లక్ష్మీ అపర్ణ నగరంలోని పలు డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తూ స్థానిక సమస్యల పరిష్కారం, నగర అభివృద్ధే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.








కామెంట్లు (0)