సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబంగారం రూ.2600 తగ్గుదల

4 గంటల క్రితం

బంగారం రూ.2600 తగ్గుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 11:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : బంగారం ధరల్లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. సోమవారం న్యూఢిల్లీ బులియన్‌ ‌మార్కెట్‌‌లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.2,600 పతనమై రూ. 1.5 లక్షలుగా నమోదైంది. ఇదే బాటలో వెండి కూడా తగ్గింది. అన్ని రకాల పన్నులతో కలిపి కిలో వెండిపై రూ.5,000 పడిపోయి రూ. 2.32 లక్షలుగా పలికిందని బులియన్‌ ‌వర్గాలు తెలిపాయి. బంగారం ధర ఒకరోజులో ఈ స్థాయిలో తగ్గడం సెప్టెంబర్‌ 1 తరువాత ఇప్పుడే కావడం గమనార్హం. హైదరాబాద్‌ ‌మార్కెట్‌‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.2,510 తగ్గి రూ.1,50,170గా పలికింది. 22 క్యారెట్లపై రూ.2300 దిగివచ్చి రూ.1,37,650 వద్ద నమోదైంది.

10 గ్రాముల వెండిపై రూ.50 తగ్గి రూ.2450గా చోటు చేసుకుంది. అమెరికా డాలర్ బలపడటం పసిడి, వెండి ధరలపై ఒత్తిడి తెస్తోందని లెమన్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ గౌరవ్ గర్గ్ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 128.93 డాలర్లు లేదా 3.01 శాతం క్షీణించి 4,156.44 డాలర్లకు పడిపోయింది. వెండి కూడా ఔన్సుకు 2.96 డాలర్లు లేదా 4.6 శాతం తగ్గి 61.34 డాలర్ల వద్ద నమోదైంది.

హర్మూజ్‌ జలసంధిని తెరిచే శాంతి ప్రణాళికకు అమెరికాలోని ట్రంప్‌ ప్రభుత్వం మొగ్గుచూపడం లేదు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతు న్నాయి. ఇలాగే కొనసాగితే ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశముంది. ఇటీవల వడ్డీ రేట్లను పెంచిన అమెరికన్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (సెంట్రల్‌ బ్యాంక్‌) మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశముందని అంచనాలున్నాయి. అమెరికా బాండ్ల ప్రతిఫలాలు ఐదు శాతం పైనే ఉన్నాయి. అమెరికన్‌ డాలర్‌ సూచీ 101.39కి పెరిగింది. రెండు నెలల్లో ఇదే గరిష్టస్థాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టడానికి మదుపర్లు ముందుకు రావడం లేదని బులియన్‌ విశ్లేషకులు చెబుతు న్నారు. అందువల్లే ధరలు తగ్గుతున్నాయని విశ్లేషిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్