ముంబయి:వెండి దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు దేశీయ మార్కెట్‌పై స్పష్టమైన ప్రభావం చూపుతున్నాయని తెలుస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వెండి వినియోగదారుల్లో ఒకటైన భారత్‌లో ప్రస్తుతం వెండి కొరత ఏర్పడిందని బులియన్ వర్గాల సమాచారం. సాధారణంగా డిమాండ్ అంతగా లేకపోయినా, దిగుమతులు దాదాపు నిలిచిపోవడంతో సరఫరా తగ్గి ధరలపై ఒత్తిడి పెరిగింది. భారత్ తన వెండి అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. అయితే మే నెల మధ్య నుంచి వెండి దిగుమతులపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.
అనంతరం జూన్‌లో వెండి గ్రెయిన్, వెండి పొడిని కూడా పరిమిత దిగుమతుల జాబితాలో చేర్చి దిగుమతులకు ముందస్తు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేసింది. దీంతో దిగుమతులు ఒక్కసారిగా భారీగా తగ్గిపోయాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత ఏడాది మే నెలలో 534.3 మెట్రిక్ టన్నులుగా ఉన్న వెండి దిగుమతులు ఈ ఏడాది మేలో కేవలం 46.8 మెట్రిక్ టన్నులకు పడిపోయాయి. జూన్‌లో దిగుమతులు మరింత తగ్గినట్లు ప్రముఖ వెండి దిగుమతి సంస్థ అమ్రపాలి గ్రూప్ గుజరాత్ సిఇఒ చిరాగ్ ఠక్కర్ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయ మార్కెట్‌లో వెండి ఔన్స్‌కు 6.5 డాలర్ల ప్రీమియంతో విక్రయమవుతోందని.. మే నెలలో మాత్రం ఔన్స్‌కు 5.5 డాలర్ల వరకు డిస్కౌంట్‌లో లభించిందని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు బుధవారం ఒక్కసారిగా దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఉదయంతో పోలిస్తే రూ.2వేలకు పైగా తగ్గి రూ.1,46,730 వద్దకు చేరగా, కిలో వెండి ధర క్రితం రోజుతో పోలిస్తే రూ.6వేల మేర తగ్గి రూ.2.28 లక్షలకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4200 డాలర్ల నుండి 4049 డాలర్లకు పడిపోయింది.








కామెంట్‌లు (0)