- డోర్ హ్యాండిల్స్‌లో సమస్యలు
బీజింగ్ : భద్రతా సమస్యల కారణంగా టెస్లా దాదాపు 30 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేయనుంది. చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ (ఎస్‌ఎఎంఆర్) ప్రకారం.. చైనాలో తయారైన, దిగుమతి చేసుకున్న టెస్లా మోడల్ 3, మోడల్ వై, మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ తదితర 29.8 లక్షల వాహనాలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తాయి. ప్రమాదం జరిగినప్పుడు వాహనం విద్యుత్ సరఫరా కోల్పోతే అత్యవసరంగా తలుపులు తెరవడానికి ఉపయోగించే మెకానికల్ వ్యవస్థను గుర్తించడం, ఆపరేట్ చేయడం కష్టంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ సమస్య కారణంగా ప్రమాదాల సమయంలో వాహనాల్లోని ప్రయాణికులు బయటకు రావడం లేదా సహాయక బృందాలు వారిని రక్షించడం కష్టమవుతుందని అధికారులు తెలిపారు. సమస్య పరిష్కారంలో భాగంగా టెస్లా హెచ్చరిక లేబుళ్లను ఏర్పాటు చేయడంతో పాటు ఓవర్-ది-ఎయిర్ (ఒటిఎ) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందించనుంది. ప్రమాదం జరిగినప్పుడు కిటికీలు ఆటోమేటిక్‌గా కిందకు వచ్చేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయనుంది. ఈ రీకాల్ సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం కానుందని టెస్లా తెలిపింది. టెస్లాతో పాటు మరో ఎనిమిది చైనా వాహన తయారీ సంస్థలు కూడా ఇదే తరహా భద్రతా సమస్యలపై రీకాల్ చేపట్టనున్నాయి. మొత్తంగా చైనాలో సుమారు 43 లక్షల వాహనాలు ఈ రీకాల్ పరిధిలోకి వస్తున్నాయి.








కామెంట్‌లు (0)